Share News

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:33 PM

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశా మని ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ఘని తెలిపారు.

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- గద్వాల జిల్లాలో 40 పరీక్షా కేంద్రాలు,హాజరుకానున్న 7,717 మంది విద్యార్థులు

- ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ ఘని

గద్వాల సర్కిల్‌, మార్చి19 (ఆంధ్రజ్యోతి): రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశా మని ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ఘని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాల్లో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని బుధవారం తన ఛాంబర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేశాం. 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. రవాణా సౌకర్యం లేని ప్రాంతా లకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాం.

ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?

జిల్లా వ్యాప్తంగా 184 పాఠశాలల నుంచి 7,717 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరుకానున్నారు. వీరిలో 3,866 బాలికలు, 3,851 బాలురున్నారు. 7,600 మంది రెగ్యులర్‌, 117మంది ప్రైవేట్‌ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది.

ఎంత మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు?

ఈ నెల 21న ప్రారంభమై వచ్చే 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 40 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 40 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 40 మంది సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, 8 మంది సీ సెంటర్స్‌ కస్టోడియన్‌ ఆఫీసర్స్‌, 18 మంది స్టోరేజ్‌ పాయింట్‌ కస్టోడియన్స్‌, మూడు బృందాలతో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 431 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.

ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతుల కూడా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా మెరుగైన స్థానంలో ఉంటుందనే విశ్వాసం ఉంది.

పది పరీక్షలు రాసే విద్యార్థులకు మీరిచ్చే సూచనలు...?

విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. పరీక్షకు అవసరమయ్యే సామగ్రిని మరువకుండా జాగ్రత్తపడాలి. భయపడ కుండా పరీక్షా రాయాలి. ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్న నమ్మకంతో విద్యార్థులు ఆత్మస్తైర్యాన్ని నింపుకోవాలి. పరీక్ష రాసే ప్రతీ పదో తరగతి విద్యార్థికి ఆల్‌ ది బెస్ట్‌... అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నా.

Updated Date - Mar 19 , 2025 | 11:33 PM