రోడ్డుకిరువైపులా.. చెత్తాచెదారం
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:10 PM
పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
పట్టించుకోని అధికారులు
సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజల వేడుకోలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవలే 14వ వార్డు పరిధిలోని బండమీదిపల్లి, 13వ వార్డు హనుమాన్‌పూరలో కూడా సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ జమ్మలమ్మనగర్ కాలనీకి వెళ్లే దారిలోని మట్టిరోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆ కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు పంట పొలాల మధ్యన ఉండటం వల్ల సమీపంలో చికెన్ వ్యాపారం నిర్వహించే వ్యాపారులు రాత్రి వేళ వ్యర్థాలు తీసుకొచ్చి రోడ్డుకిరువైపులా పారవేస్తున్నారు. దీంతో సమీప కాలనీల ఇళ్ల వరకు దుర్గంధం వస్తోంది. ఈ క్రమంలో చికెన్ వ్యర్థాల కోసం వచ్చిన వీధి కుక్కలు రోడ్డుపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. ఈ రోడ్డుకు చివరలో జమ్ములమ్మ ఆలయం ఉంది. ప్రతీ మంగళ, శుక్రవారల్లో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు, వ్యాపారులు రోడ్డుకు ఇరు వైపులా వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.