Share News

శ్రీవిశ్వావసుకు ఘన స్వాగతం

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:53 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

శ్రీవిశ్వావసుకు ఘన స్వాగతం
అయిజలో పంచాంగ శ్రవణానికి హాజరైన గ్రామస్థులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. షడ్రుచుల ఉగాది పచ్చడి, భక్ష్యాలను ఆరగించారు. ఆలయాల్లో పూజలుచేశారు. రైతులు బసవన్నలకు కాడి కట్టి గ్రామ దేవతల ఆలయాల ముందు పూజలు చేశారు. వాటికి భక్ష్యాలు తినిపించారు. పలుచోట్ల రైతులు వేకువజామున తమ పంట పొలాలకు వెళ్లి నాగళ్లతో పొలం దున్ని పశువుల కాడికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని వరుణ దేవున్ని వేడుకున్నారు. సాయంత్రం పురోహితులు పంచాంగ పఠనం నిర్వహించారు.

అలంపూరు: దక్షిణకాశీ అలంపూరు శక్తిపీఠంలో జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామికి భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్‌లలో రద్దీ నెలకొంది. అలాగే మండల వ్యాప్తంగా గ్రామాల్లో పంచాంగ పఠనం చేశారు.

Updated Date - Mar 30 , 2025 | 11:53 PM