Share News

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి : ఎస్పీ జానకి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:26 PM

ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని ఎస్పీ జానకి అన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి : ఎస్పీ జానకి
మాట్లాడుతున్న ఎస్పీ జానకి

మిడ్జిల్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని ఎస్పీ జానకి అన్నారు. బుధవారం మండలంలోని వల్లభురావుపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా ఎస్పీ జానకి ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చే అన్నారు. అంతకుముందు పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. రూరల్‌ సీఐ నాగర్జునగౌడ్‌, మిడ్జిల్‌ ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు, సిబ్బంది నారాయణరెడ్డి, పర్వతాచారి, సురేష్‌గౌడ్‌, శ్రీను ఉన్నారు.

పది పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎన్‌ఎస్‌ సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు ఎస్పీ జానకి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌శాఖ అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లాలో 60 కేంద్రాలు 12,769 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదు మందికి మించి గుంపులుగా ఉండటానికి వీలులేదన్నారు. పరీక్షా సమయంలో ఆయా కేంద్రాల పరిసరాల్లో ఇంటర్నెట్‌, జిరాక్స్‌ కేంద్రాలను మూసి ఉంచాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, మైక్‌లు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని సూచించారు. అన్ని కేంద్రాల పరిధిలో పెట్రోలింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:26 PM