MK Stalin: చెన్నైలో సంకల్పం.. హైదరాబాద్‌లో నెరవేరింది
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:14 AM
నియోజకవర్గ పునర్విభజనపై తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానం ప్రారంభం మాత్రమేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చెన్నైలో చేసిన సంకల్పం హైదరాబాద్‌లో నెరవేరిందని పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ తీర్మానంపై తమిళనాడు సీఎం స్టాలిన్
యుద్దం ఇంకా ఉంది... విజయం సాధిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పునర్విభజనపై తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానం ప్రారంభం మాత్రమేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చెన్నైలో చేసిన సంకల్పం హైదరాబాద్‌లో నెరవేరిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో చేసిన పోస్టుకు ఈ మేరకు స్పందించారు. ప్రజల హక్కులు, రాజకీయ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని గురువారం ఆమోదించామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. హక్కుల పరిరక్షణకు, ఆర్థికంగా అత్యధిక ఉత్పాదకత కలిగిన రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా పక్షపాత ధోరణితో చేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకునేందుకు తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా పోరాడతామని రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానంతో ఈ పోరాటంలో తొలి విజయం సాధించమని, అసలు యుద్ధం ముందుందని, అందులోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ పోస్టుకు స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేలా.. నియోజకవర్గ పునర్విభజన పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం.. ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) రెండో సమావేశం హైదరాబాద్‌లో జరిగిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ చూపిన బాటను మరిన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా తిరగరాస్తామంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News