Share News

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:25 AM

ఎట్టకేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవన్నపేటలో దేవాదుల మూడోదశ పంప్‌హౌజ్‌ వద్ద ఒక మోటార్‌ రన్‌ ప్రారంభమైంది.

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

మోటార్‌ ఆన్‌ చేసిన ఉత్తమ్‌, పొంగులేటి.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

దేవన్నపేట, ధర్మసాగర్‌లలో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు

2026 డిసెంబరుకల్లా దేవాదుల పూర్తి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేవాదులపై దశాబ్ద నిర్లక్ష్యం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వరంగల్‌/హనుమకొండ టౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎట్టకేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవన్నపేటలో దేవాదుల మూడోదశ పంప్‌హౌజ్‌ వద్ద ఒక మోటార్‌ రన్‌ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ముఖ్య అతిధులుగా మోటార్‌ స్విచ్ఛాన్‌ చేయడంతో ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పరుగులు తీశాయి. అక్కడనుంచి మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, యశస్విని రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఒక మోటార్‌ రన్‌ ప్రారంభించడంతో కరువుతో అల్లాడుతున్న జనగామ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సుమారు 65 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 రోజుల్లో దేవన్నపేట పంప్‌హౌజ్‌ వద్ద రెండో మోటార్‌ ప్రారంభించి 600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేస్తామన్నారు. మోటార్లు 15-20 రోజులు నడపాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దేవాదుల పూర్తి కాలేదని ఆరోపించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. గత సర్కార్‌ కొత్త ప్రాజెక్టులకే భారీగా నిధులు ఖర్చు చేసిందని, కొద్దిపాటి నిధులతో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయొచ్చన్న ఆలోచనే చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అందరి సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.


ట్రయల్‌ రన్‌ పదనిసలు

దేవాదుల దేవన్నపేట పంప్‌హౌజ్‌ మోటార్‌ ట్రయల్‌ రన్‌ కోసం మేఘా కంపెనీ ఇంజనీర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు పది రోజులు తీవ్రంగా శ్రమించారు. గత నెల 18న మోటార్‌ రన్‌ కోసం దేవన్నపేటకు మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి వచ్చారు. కానీ మోటార్‌ మొరాయించడంతో వెనుదిరిగారు. నాటి నుంచి ఇంజనీర్లతోపాటు ఆస్ట్రియాకు చెందిన అన్‌రీజ్‌ కంపెనీ నిపుణులు శ్రమించడంతో గురువారం తెల్లవారుజామున 2.30గంటలకు మోటార్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. ఈ సంగతి తెలియగానే మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి.. గురువారం సాయంత్రం హెలికాప్టర్‌లో దేవన్నపేటకు చేరుకున్నారు. మంత్రులు రాగానే మళ్లీ మోటార్‌ మొరాయించడంతో ఆందోళనకు గురయ్యారు. తిరిగి సాంకేతిక నిపుణులు గంటసేపు శ్రమించి సమస్య పరిష్కరించారు.


అధికారిక కార్యక్రమానికి నన్ను పిలువరా?

దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంప్‌హౌస్‌ ప్రారంభ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాదకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దేవాదుల ప్రాజెక్టులో 40 శాతం తన నియోజకవర్గ పరిధిలోనికి వస్తుందని తెలిపారు.


దొడ్డు బియ్యం ఎవరూ తినట్లేదు

  • అందుకే సన్నబియ్యం పంపిణీ: ఉత్తమ్‌

నల్లగొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాలు నలభైయేళ్లుగా దొడ్డు బియాన్ని సరఫరా చేస్తున్నాయని, కానీ ఆ బియ్యాన్ని పది శాతం మంది కూడా తినడం లేదని రాష్ట్ర పౌరసఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈనెల 30 నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ నుంచి ప్రారంభించబోతున్న సందర్భంగా ఆ కార్యక్రమ ఏర్పాట్లను గురువారం మంత్రి ఉత్తమ్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో సన్నబియ్యం అందించబోతున్నామన్నారు. దాదాపు రూ.8 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2.84 కోట్ల మందికి లబ్ధి చేకురుతుందని తెలిపారు. ఉగాది సందర్భంగా ఈ నెల 30న స్థానిక నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:25 AM