Share News

మూసీ జలాల కోసం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:46 AM

చౌటుప్పల్‌ ప్రాంతం లో నెలకొన్న తీవ్రమైన సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మూసీజలాలను మళ్లించాలని ఆందోల్‌మైసమ్మ జలసాధన సమి తి ఆధ్వర్యంలో రైతు ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. మూడు నెలలుగాసాగుతున్న సాగునీటి ఉద్యమాలతో గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఐక్య ఉద్యమాలబాట పడుతున్నారు.

మూసీ జలాల కోసం

మళ్లించాలని ఉధృతమవుతున్న రైతు ఉద్యమాలు

మూసీలో మైసమ్మ కత్వ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలి

రూ.52కోట్ల అంచనాతో లిఫ్ట్‌కు రూపకల్పన

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని కలిసిన రైతులు

లిఫ్ట్‌ ఏర్పాటుకు నిధుల మంజూరుకు రైతుల డిమాండ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ ప్రాంతం లో నెలకొన్న తీవ్రమైన సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మూసీజలాలను మళ్లించాలని ఆందోల్‌మైసమ్మ జలసాధన సమి తి ఆధ్వర్యంలో రైతు ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. మూడు నెలలుగాసాగుతున్న సాగునీటి ఉద్యమాలతో గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఐక్య ఉద్యమాలబాట పడుతున్నారు. మండల పరిధిలోని తూఫ్రాన్‌పేట సమీపంలోని చిన్నమూసీలోగల మైసమ్మకత్వ వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటుచేసి పిలాయిపల్లి కాల్వ ద్వారా ప్రవహించే మూ సీ జలాలను దిగువ ప్రాంతానికి మళ్లించాలన్న డిమాండ్‌తో రైతు ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మూడునెలల క్రితం ఆందోల్‌ మైసమ్మ దేవాలయంవద్ద నిర్వహించిన రైతుల సమావేశంలో సాగునీటి ఉద్యమానికి బీజంపడింది. లిఫ్ట్‌తో మూసీజలాలను మళ్లించే పథకానికి రూ.52కోట్ల వ్యయమవుతుందని ప్రముఖ రిటై ర్డు ఇంజనీరు శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి ఒక నివేదికను రూపొందించారు.

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి దృష్టికి

గ్రామాల్లో నెలకొన్న సాగునీటి సమస్యను ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి దృష్టికి రైతులుతీసుకువెళ్లారు. మూసీ జలాలను లిఫ్ట్‌ ద్వారా మళ్లించి సాగునీటి సమస్య ను పరిష్కరించాలని, అందుకు రూ.52కోట్లు ఖర్చవుతుందని రైతులు తెలిపారు.

గ్రామాల్లో తీవ్రంగా సాగునీటి సమస్య

మండలంలోని అనేక గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రధానం గా తూఫ్రాన్‌పేట, దండుమల్కాపురం, ఖైతాపురం, ఎల్లగిరి, కొయ్యల గూడెం, డి.నాగారం, ధర్మోజిగూడెం, లక్కారం, చౌటుప్పల్‌, తంగడపల్లి, చింతలగూడెం, దామెర, ఆరెగూడెం తదితర గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. సాగు భూములన్నీ బీడు భూములుగా మారిపోతుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచారంగా మారింది. రైతులు తమ భూముల సేద్యాన్ని వదిలిపెట్టి ఉపాధికోసం ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. మూడేళ్ల నుంచి వర్షాలు కురియక తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయు. భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో 1000 అడుగులలోతు ఉన్న బోరు బావులు సైతం ఒట్టిపోతున్నాయి. అక్కడక్కడ రైతులు సాగు చేసిన వరి పంట పొలాలు సైతం ఎండిపోయి పశువులకు గ్రాసంగా మారిపోయింది. సాగుకోసం రైతులు పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోవడంతో కన్నీళ్లు పెడుతున్నారు. మూగజీవాలకు సైతం తాగు నీరు దొరకని విపత్కర పరిస్థితి ఏర్పడింది. అటవీ ప్రాంతాల్లో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇదిలా ఉంటే లక్కారం చెరువు లోకి వరద కాలువ కోసం 1992 లోనే రైతు ఉద్యమాలు ఉధృతంగా సాగాయి.

మూడొంతుల గ్రామాలకు కరువైన సాగునీరు

చౌటుప్పల్‌ మండలంలోని మూడొంతుల గ్రామాలకు సాగు నీటి వనరులు లేక వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. గ్రామాల్లో వరి పొలాలు కనిపించడంలేదు. వర్షాదార పంటలపై ఆధారపడిన రైతులకు ఆశించిన ప్రయోజనం లేకుండాపోయింది. రెండు, మూడు గ్రామాల్లో ఆకు కూరలను సాగు చేసుకుంటూ రైతులు జీవనం సాగిస్తున్నారు. మూడేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో సాగునీటి కోసం రైతులు ఉద్యమ బాటపట్టారు. కాగా, పిలాయిపల్లి కాల్వను నిర్మించిన ఆరేడు గ్రామాల్లో సాగునీటి సమస్య కనిపించడం లేదు.

ఆందోళ్‌ మైసమ్మ జలసాధన సమితి ఆవిర్భావం

ఈ ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఆందోళ్‌ మైసమ్మ దేవాలయం పేరుతో జలసాధన సమితిని 2025 జనవరి 19న రైతులు ఉద్యమ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లోని అనేక గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి ఉద్యమాలకు సన్నద్ధం చేస్తున్నారు.

మైసమ్మ కత్వ లిఫ్ట్‌కు రూ.52కోట్లు

తూఫ్రాన్‌పేట సమీపంలోని పిలాయిపల్లి కాల్వ వద్ద (చిన మూసీనదిలో) మైసమ్మ కత్వ వద్ద లిఫ్ట్‌ ను ఏర్పాటు చేసి మూసీ జలాలను మళ్లించే ప్రాజెక్ట్‌కు రూ.52కోట్ల వ్యయమవుతుందని రిటైర్డ్‌ ఇంజనీరు శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఒక నివేదికను రూపొందించారు. దీని ప్రకారం మైసమ్మ కత్వకు ఎగువ భాగంలో చిన మూసీనదిలో రూ.2కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మించడంతోపాటు రూ.75లక్షలతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ తదితర వాటిని ఏర్పాటుచేయాలి. రూ.4కోట్లతో 3.60మెగావాట్ల ఎస్‌వీటీ రెండు మోటార్లను బిగించి 80మీటర్ల ఎత్తుకు గుట్టపైకి జలాలను లిఫ్టింగ్‌ చేయాలి. అక్కడినుంచి రూ.7.80కోట్ల అంచనాతో 2కిలోమీటర్ల పొడవున 1100 ఎంఎం (డయా.. మీటరు) వ్యాసార్థంగల పైపును ఏర్పాటుచేసి చివరన సంప్‌ను నిర్మించాలి. సంప్‌ నుంచి రూ.26.71 కోట్ల అంచనాతో 1500 ఎంఎం వ్యాసార్థంగల పైప్‌ను 5 కిలోమీటర్ల పొడవుతో శేషరాజ్‌ కుంట దిగువ ప్రాంతంవరకు ఏర్పాటు చేయాలి. జీఎస్టీ, టెండర్‌ ప్రకటన, డెలివరీ తదితర ఇతర చార్జీలకు రూ.10.74కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. కాగా, మైసమ్మ కత్వకు దక్షిణభాగంలో 600 మీటర్ల దూరంలో బ్యాక్‌ వాటర్‌లో ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో నిర్దేశించారు. ఈ లిఫ్ట్‌నుంచి దిగువ ప్రాంతానికి అవసరమైన జలాలను పంపించేందుకు ఎగువ భాగంలోని పిలాయిపల్లి కాల్వను వెడల్పు చేయడంతో పాటు మైసమ్మ కత్వ ఎత్తును పెంచాల్సి ఉంటుంది. మండల పరిధిలోని దండు మల్కాపురంలోని శేషరాజ్‌ కుంటలోకి చేరుకున్న మూసీ జలాలు కీలకం కానున్నాయి.

చౌటుప్పల్‌ ప్రాంతం వైపు

మైసమ్మ కత్వనుంచి లిఫ్ట్‌ ద్వారా వచ్చిన మూసీ జలాలు శేషరాజ్‌ కుంటలోకి చేరుకుంటాయి. అందులో నుంచి దండుమల్కాపురం పెద్ద చెరువు, ఖైతాపురం, లక్కారం, చౌటుప్పల్‌, తాళ్లసింగారం, పంతంగి, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, ఏపూర్‌, పేరపల్లి, మునుగోడు మండలం కిష్టాపురం చెరువుల్లోకి వెళ్తాయి. ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు కావడంతో ఒకదాని తర్వాత ఒకటి నిండి అలుగుపోస్తాయి.

మూసీ జలాలను వ్యతిరేకిస్తున్న సంస్థాన్‌ రైతులు

మూసీజలాలను సంస్థాన్‌నారాయణపురం మండలానికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాలుష్య కారక మూసీజలాలతో తమసాగు భూములు దెబ్బతింటాయని, ప్రాణకోటికి నష్టం జరుగుతుందని వారు వివరిస్తున్నారు. కృష్ణా జలాలతోనే తమ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మండలానికి కృష్ణా, గోదావరి జలాలు

చౌటుప్పల్‌ మండలానికి కృష్ణా, గోదావరి జలాలను మళ్లించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. కాలుష్యకారక మూసీ జలాలతో భూసారం దెబ్బతింటుందని, జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉందని ఇటీవల తనను కలిసిన చౌటుప్పల్‌ ప్రాంత రైతులకు ఎమ్మెల్యే వివరించారు. మండలంనుంచి వెళుతున్న 65వ నెంబర్‌ జాతీయ రహదారికి ఉత్తరం వైపు గోదావరి జలాలు, దక్షిణం వైపు కృష్ణాజలాలతో చెరువులు, కుంటలను నింపి సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం.

ఉద్యమాలు కొనసాగిస్తాం

ముత్యాల భూపాల్‌ రెడ్డి, కన్వీనర్‌, జలసాధన సమితి, చౌటుప్పల్‌ ( 1సీపీఎల్‌ టౌన్‌ 5)

చిన మూసీనదిలోని మైసమ్మ కత్వ వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి మూసీ జలాలను మళ్లించే వరకు రైతు ఉద్యమాలను కొనసాగిస్తాం. మూసీ జలాలతోనే గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపి సాగునీటి వనరులను పెంపొందించాలి. గ్రామాల్లో నెలకొన్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇదొక్కటే మార్గం. సాగునీటి వనరులు లేక వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలను సాగిస్తాం.

నిధులు మంజూరు చేయాలి

కొంతం అనంతరెడ్డి, ఆర్గనైజర్‌, జలసాధన సమితి, చౌటుప్పల్‌ (1సీపీఎల్‌ టౌన్‌ 6)

మైసమ్మ కత్వ వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటుచేసి మూసీ జలాలను మళ్లించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఈ పథకంతో మూడు మండలాల్లోని సుమారు 25 నుంచి 30 చెరువులు, కుంటలలోకి మూసీజలాలు వెళ్లే అవకాశం ఉంది. వందల ఎకరాలు సాగులోకి రానుంది. ఈ పథకానికి రూ.52కోట్లు వ్యయం జరుగుతుందని ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా.

Updated Date - Apr 02 , 2025 | 12:47 AM