Share News

సాగర్‌, మూసీకి పూడిక ముప్పు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:35 AM

ఆధునిక దేవాలయం, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌ జలాశయం రోజు రోజుకూ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు జిల్లాల పరిధిలోని ఆయకట్టు అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న సాగర్‌ జలాశయంలో నీటి నిల్వ తగ్గుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాగర్‌, మూసీకి పూడిక ముప్పు

ఈ ఏడాది సుమారు 112 టీఎంసీల మేరతగ్గిన నీటి నిల్వ

ఏటా వందల టీఎంసీల నీరు కడలిపాలు

రాళ్లు, రప్పలతో పేరుకుపోతున్న పూడిక

ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

(ఆంధ్రజ్యోతి,నాగార్జునసాగర్‌) : ఆధునిక దేవాలయం, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌ జలాశయం రోజు రోజుకూ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు జిల్లాల పరిధిలోని ఆయకట్టు అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న సాగర్‌ జలాశయంలో నీటి నిల్వ తగ్గుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా నది పరివాహకం 2,58,948 చదరపు కిలోమీట ర్ల మేర విస్తరించి ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో పాటు ఒండ్రు మట్టి, ఇసుక ఏటా నాగార్జునసాగర్‌ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. అదే విధంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఎత్తయిన గుట్టల పై నుంచి వచ్చే వరద నీటితో పాటు రాళ్లు, రప్పలు కృష్ణ నదిలోకి వచ్చి చేరుతున్నాయి. వరద అఽధికంగా వచ్చే సమయంలో నదీ తీరాలను ఒరుసుకుంటూ వచ్చే నీటి ఉధృతితో తీరాలు కోతకు గురై చెట్లు, చేమలు, మట్టి కొట్టుకొని వచ్చి ఏటా జలశయంలోకి చేరుతోంది. జలాశయంలో నిండుగా నీరున్నపుడు గుట్టలు నదిలోకి కూలుతున్నాయి. 110 చదరపు మైళ్ల పరిధిలో ఐదు జిల్లాల నడుమ విస్తరించి ఉన్న జలాశయంలో వేలాదిగా జీవా లు, జంతు జలాలు తాగునీటికి వచ్చినపుడు ఎత్తయిన ప్రాంతాల నుంచి జారిపడే రాళ్లు తక్కువేమీ కావు. ఒక్క రోజేగాక ఏడాది పొడవునా ఇదే జరుగుతోంది. జలాశయం నుంచి మాత్రం ఒక్క తట్ట మట్టి గానీ, ఏ ఒక్క రాయి కూడా బయటికి వెళ్లడం లేదు. దీంతో పూడిక పెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. పూడికకు నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌ ఏడారిగా మారే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు శూన్యం

సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా, 1967లో పూర్తయింది. నాటి నుంచి నేటి వరకు 70 ఏళ్లలో చేరిన పూడిక సుమారు 112 టీఎంసీల (శతకోటి ఘనపుటడుగులు) పైచిలుకు నీటి నిల్వలు ఉండే ప్రాంతాన్ని మింగేసింది. ఏ ప్రభుత్వం కూడా నేటి వరకు పూడికపై ఎలాంటి దృష్టిసారించలేదు. దీంతో ఆయకట్టు రైతాం గం ఆందోళనకు గురవుతోంది. కేం ద్రం జల నిపుణుల బృందం ఐదు, పదేళ్లకోసా రి పూడికపై సర్వే నిర్వహించి ఎంత పూడిందో చెప్పడమేగానీ ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించిన దాఖలాలు లేవు. సాగర్‌ జలాశయాన్ని గరిష్ఠ వరద ప్రవాహం 10.60లక్షల క్యూసెక్కుల వరకు తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు.

తగ్గుతూ వస్తోందిలా..

నాగార్జునసాగర్‌ జలాశయ నిర్మాణ సమయంలో నీటి నిల్వ సామర్థ్యం 408.24టీఎంసీలు (శతకోటి ఘనపుటడుగులు). 2010 నాటికి 312.1456 టీఎంసీలకు తగ్గింది. సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 1967 నుంచి 1974 నాటికి 14.4 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. 1978 నాటికి 48.7టీఎంసీలకు, 2001-2009 నాటికి 79.21 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. 2009 అక్టోబరు నెలలో 2, 4వ తేదీలో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల్లో ఎక్కువ మొత్తంలో బురద కొట్టుకు వచ్చింది. నాడు 25లక్షల క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరింది. అంటే ఆ సమయంలో నదిలోకి ఎంత మేర బురద వచ్చి చేరిందో అంచనా వేయడం కూడా కష్టం. 2010 నాటికి నీటినిల్వ సామర్థ్యం 96.05 టీఎంసీలకు తగ్గింది. 2016 నాటికి అది సుమారు 108 టీఎంసీలు, 2020 నాటికి 110 టీఎంసీలు, ఈ ఏడాది మార్చి నాటికి సుమారు 112టీఎంసీల పైచిలుకు సాగర్‌ నీటి నిల్వ సామర్థ్యం తగ్గి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నీటి కేటాయింపులు

సాగర్‌ జలాశయం నుంచి కుడి కాల్వకు 132 టీఎంసీలు, ఎడమ కాల్వకు 132 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. అవిరి రూపంలో 17 టీఎంసీల నష్టం ఉంటుంది. ఈ నీటితో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా డెల్టాలో వేలాది ఎకరాలకు సాగునీటితో పాటు విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోంది. జంటనగరాలతో పాటు ఆయకట్టు పరిధిలోని ఐదు జిల్లాల్లోని వందలాది చెరువులు నింపి వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. రాష్ట్రంలోని ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు సాగర్‌ జలాశయం నుంచే వెళ్తోంది. ఇంత ప్రాధాన్యం ఉన్న జలాశయంలో పూడిక చేరినా, నివారణపై ప్రభుత్వాలకు శ్రద్ధ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పూడిక నివారణకు నిపుణుల సూచనలు

పూడికను తొలగించడం అనేది జరగదని, కేవలం నివారణ ఒక్కటే మార్గం అని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. వీరిచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.

ఫ జలాశయానికి ముందు మినీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి.

ఫ వరద ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట మట్టి నిలిచేందుకు అడ్డుకట్టలు వేయాలి.

ఫ గుట్టల మీదుగా వచ్చే వరదతో పాటు కొట్టుక వచ్చే రాళ్లు, మట్టిని నివారించేందుకు రాతి కట్టడాలు నిర్మించాలి.

ఫ జలాశయంలో నీరు తగ్గిన సమయంలో ప్రాజెక్టు తీరాల్లో ఉన్న ఆయకట్టేతర ప్రాంతాల్లోని మెట్ట భూముల్లోకి ఒండ్రు మట్టిని ప్రభుత్వ ఖర్చులతో తరలించాలి.

ఫ నది మధ్యలో ఉన్న గుట్టల చుట్టూ రాళ్లు నదిలోకి పడకుండా జాలీలు ఏర్పాటు చేయాలి.

క్యూసెక్కులు.. లెక్కలు

నీటి ప్రవాహాన్ని క్యూసెక్కుల్లో, నీటి నిల్వ సామర్థాన్ని టీఎంసీల్లో లెక్కిస్తారు. క్యూసెక్కు అంటే క్యూబిక్‌ మీటర్‌ ఫర్‌ సెకన్‌. అంటే ఒక సెకను కాలంలో ప్రవాహించే ఘనపుటడుగు నీరు. వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారంటే సెకనుకు వెయ్యి ఘనపుటడుగుల నీరు విడుదల చేసినట్లు అవుతుంది. ఒక క్యూసెక్కు నీటితో సుమారు 130 ఎకరాల్లో వరి సాగుచేయవచ్చు. ఒక రోజంతా ఇలాగే ఉంటే గంట పాటు జలాశయం నుంచి 11,575 క్యూసెక్కుల నీరు వెళ్తే అది ఒక టీఎంసీతో సమానం. ఒక టీఎంసీ నీటితో 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ఒక సీజన్‌ మొత్తం ఆరు తడి పంటలు సాగుచేయవచ్చు. ఇదే నీటితో 5,400 నుంచి 6,500 ఎకరాల్లో ఒక సీజన్‌లో వరి సాగుచేయవచ్చు. వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తూ 7,000 నుంచి 7,500 ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు. అలాగే ఒక టీఎంసీ నీటితో 6.67 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. 30 నుంచి 50 టీఎంసీల నీటితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో సగానిపైగా ప్రాంతాలకు తాగునీరు అందించవచ్చు.

నానాటికీ తగ్గుతున్న రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం

పరిరక్షణ చర్యలుచేపట్టాలని సీడబ్ల్యూసీ హెచ్చరిక

(ఆంధ్రజ్యోతి,కేతేపల్లి) : నిధుల కొరత, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వెరసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెం డో నాగార్జునసాగర్‌ గా ఉన్న మూసీ జలాశయానికి పూడి క ముప్పు ముంచుకొస్తోంది. జిల్లాలో రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా పూడికతో నిండుతోంది. సుమారు 30వేల ఎకరాలకు సాగునీరందించే ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది.

నాగార్జునసాగర్‌ తర్వాత ఉమ్మడి జిల్లాలో ప్రధాన నీటి వనరుగా మూసీ ప్రాజెక్టు ఉం ది. ప్రాజెక్టుకు ఉన్న స్కవర్‌గేట్లు పూర్తిగా మూసి వేయడంతో మూసీ నదికి వరద లు వచ్చినప్పుడు ఉప నదులు, వాగుల ప్రవాహంతో ఇసుక, మట్టి వరద నీటి తో కలిసి ప్రాజెక్టులోకి వచ్చి పేరుకుపోతోంది. మూసీ ఎగువన ఉన్న పట్టణాలు, నగరాల నుంచి వినియోగించిన జలాలు, మురుగు సైతం ప్రాజెక్టులోకి చేరుతోంది. నది ఒడ్డు కోతకు గురికావడం కూడా పూడికకు ఓ కారణంగా ఉంది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏటా తగ్గుతుండగా, పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించడంలో విఫలమవుతోంది. 25.25చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రిజర్వాయర్‌లో చేరిన పూడిక సుమారు 10అడుగుల మేర ఉండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ అడవుల్లో పుట్టిన మూసీ భువనగిరి జిల్లా మీదుగా నల్లగొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు చేరుతోంది. సూర్యాపేట మండలం సోలిపే ట వద్ద రెండు గుట్టల మధ్య రూ.2.20కోట్ల వ్యయంతో 1954లో మూసీ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా, 1963 లో పూర్తయింది. రిజర్వాయర్‌లో సూర్యాపేట మండలం సోలిపేటతో పాటు కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో చేరే పూడికను బయటికి పంపేందుకు వీలుగా 10 స్కవర్‌గేట్లు, వరద నీటిని దిగువకు వదిలేందుకు 8 క్రస్ట్‌గేట్లు, 12 రెగ్యులేటరీ గేట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. 645అడుగుల (4.46 టీఎంసీలు) నీటినిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుకు నాటి ఇంజనీరింగ్‌ నిపుణులు రూపకల్పన చేశారు. దశాబ్దాల తరబడి ప్రాజెక్టు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టు నిర్మించిన నాడు ఏర్పాటు చేసిన గేట్లు తుప్పుపట్టాయి. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి గేట్ల నిర్వహణకు నిధుల కేటాయింపు అరకొరగానే సాగింది. దీంతో 1987లో మూసీకి వచ్చిన వరద తాకిడికి 8వ నెంబర్‌ స్కవర్‌గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత శిథిలావస్థకు చేరిన 10 స్కవర్‌ గేట్లను కాంక్రీట్‌తో పూర్తి గా సీజ్‌ చేశారు. శిథిలమైన ప్రాజెక్టు 12 క్రస్ట్‌, 8 రెగ్యులేట రీ గేట్ల స్థానంలో సుమారు 24 ఏళ్ల అనంతరం 2014లో ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని 40 గ్రామాలకు చెందిన 41,800 ఎకరాల్లో వానాకాలం వరి సాగుకు నీటిని అందించేలా లక్ష్యా న్ని నిర్దేశించారు. ఆశించిన మేరకు వరద ప్రాజెక్టుకు చేరకపోవడంతో 1973లో దీన్ని యాసంగిలో ఆరుతడి... పంటలకు నీటిని అందించే ప్రాజెక్టుగా మార్చిన అధికారులు సాగు విస్తీర్ణాన్ని 33వేల ఎకరాలకు కుదించారు. నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 45వేల ఎకరాలకు సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీటిని అందించిన ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్టులో పూడిక చేరడంతో నేడు కేవలం 30వేల ఎకరాలకు సైతం నీటిని అందించలేని దుస్థితికి చేరింది. పూడికతో నిండి నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిన మూసీ ప్రాజెక్టులో పూడిక తొలగించి పూర్తిస్థాయిలో నీటినిల్వకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయకట్టు ప్రాంత రైతు ప్రతినిధులు, రైతులు కోరుతున్నారు.

15.32శాతం పూడికను నిర్ధారించిన సీడబ్ల్యుసీ...

కేంద్ర జలసంఘం(సీడబ్ల్యుసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్‌, రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతతో నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 87జలాశయాలు పూడిక కారణంతో వేగంగా నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్న సీడబ్ల్యుసీ సర్వేలో తెలంగాణలోని ఉస్మాన్‌సాగర్‌తో పాటు మూసీ జలాశయం ఉన్నాయి. మూసీ జలాశయంలో ఇప్పటికే 15.32శాతం మేర సెడిమెంటేషన్‌(పూడిక) ఉందని పరిరక్షణ చర్యలు తప్పనిసరని ఈ సర్వే సూచించింది. 4.46టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మితమైన మూసీ నిర్మించిన నాటి నుంచి 2024వరకు 0.74టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 3.72టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంది. మూసీలో పూడిక తొలగింపు, పరిరక్షణ చర్యలు చేపట్టకుంటే 2084నాటికి జలాశయ సామర్థ్యం ఒక టీఎంసీ మేర తగ్గిపోతుందని హెచ్చరించింది.

Updated Date - Mar 22 , 2025 | 12:35 AM