వెనకబడిన విద్యార్థుల కోసం ఏఐతో బోధన
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:29 AM
సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అన్నిరంగాల్లో ఎక్కువైంది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ప్రభావితం చేస్తోంది. కొన్నిగంటల వ్యవధి తీసుకునే చేసే పనులు ఏఐ ఆధారితంతో నిమిషాలకే పరిమితమైంది.

తెలుగు, గణిత అభ్యాసాలపై సులువైన పద్ధతిలో బోధన
ఉమ్మడి జిల్లాలో పలు పాఠశాలల్లో అమలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్): సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అన్నిరంగాల్లో ఎక్కువైంది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ప్రభావితం చేస్తోంది. కొన్నిగంటల వ్యవధి తీసుకునే చేసే పనులు ఏఐ ఆధారితంతో నిమిషాలకే పరిమితమైంది. విద్యావ్యవస్థలోనూ సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకూ ఏఐ ద్వారా పాఠాలను బోధిస్తున్నారు. సులువైన పద్ధతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నారు.
విద్యార్థుల్లో పలువురు మౌలిక భాష, సంఖ్యాజ్ఞానం అభ్యాసనతో పాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు కనిపించడం లేదు. దీంతో విద్యాభ్యాసంలో వెనకబడుతున్నారు. వీరికోసం విద్యాశాఖ పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేథ సాయంతో విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధన కోసం ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి విడతల వారీగా ఏఐ ద్వారా పాఠాలు అందిస్తున్నారు. వారికి తెలుగు, గణిత అభ్యాసాలపై తరగతులు ఏర్పాటుచేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
మొత్తం ఏడు మండలాల్లోని 9 పాఠశాలల్లో ఏ ఐ పాఠాలు బోధిస్తున్నారు. చౌటుప్పల్ మండలం లో జైకేసారం, దేవలమ్మనాగారం, భువనగిరి మం డలంలో తుక్కాపూర్, మోటకొండూరు మండలం లో ముత్తిరెడ్డిగూడెం, ఆలేరు మండలంలో కొల్లూ రు,రామన్నపేట మండలంలో ఇంద్రపాలనగరం, యాదగిరిగుట్టమండలంలో పెద్దకందుకూరు, చొ ల్లేరు, బీబీనగర్ మండలంలో జమీల్‌పేట గ్రామాల్లోని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో..
గరిడేపల్లి మండలంలోని వెల్దండ, రాయినిగూ డెం,గానుగబండ,సూర్యాపేట మండలంలో ఇమాంపేట, చివ్వెంల మండలంలో వట్టిఖమ్మంపహాడ్, హుజూర్‌నగర్ మండలంలో బూరుగడ్డ, మోతె మండంలో ఉండ్రుగొండ, నేరేడుచర్ల మండంలో చింతకుంట్ల, మఠంపల్లి మండలంలో వరదాపు రం, చింతలపాలెం మండలంలో తమ్మవరం, నడిగూడెం మండలంలో వల్లాపురం, మద్దిరాల మం డలంలో రెడ్డిగూడెం, తిరుమలగిరి మండలంలో తొండ గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతానికి 130మంది విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో...
జిల్లాలోని 10 మండలాల్లో 14 పాఠశాలల్లో ఏఐ పాఠాలు అందిస్తున్నారు. అనుముల మండలంలో హాలియా, కొత్తపల్లి, చిట్యాల మండలంలో నేరెడ, దామరచర్ల మండలంలో కల్లేపల్లి, దేవరకొండ మండలంలో ఇద్దంపల్లి, కేతేపల్లి మండలం లో తుంగతుర్తి, కొప్పోలు, మిర్యాలగూడ మండలంలో అన్నారం, మునుగోడు మండలంలో కొరటికల్, నల్లగొండ మండలంలో కంచనపల్లి, శాలిగౌరారం మండలంలో భైరవునిబండ, వేములపల్లి మండలంలో ఆమనగల్ పాఠశాలల్లో ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఐదుగురితో బ్యాచ్, 20 నిమిషాల క్లాస్
పాఠశాలల్లో అందుబాటులో ఉన్న కంప్యూటర్ల ను బట్టి ఒక్కో కంప్యూటర్‌కు ఒక విద్యార్థిని ఎంపి క చే శారు. సూర్యాపేట జిల్లాలో ఐదుగురిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు భోధిస్తున్నారు. పాఠాలను సం బంధిత విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేడా అనేది ఏఐ గుర్తించి అర్థం కాకపోతే అతడికి అర్థమయ్యే రీతిలో సరళమైన పద్ధతిలో బోధిస్తుంది. అర్థమైతే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధిస్తుంది. ఈ విధంగా ప్రతీ విద్యార్థి అభ్యాసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు గతంతో పోలీస్తే ఆ విద్యార్థి పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆ నివేదికను ఉపాధ్యాయులు తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు.
ఏఐ బోధనపై శిక్షణ పూర్తి
ఏఐ బోధన కోసం ప్రతీ జిల్లాలో పలు పాఠశాలలను ఎంపికచేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణఇచ్చారు. అనంతరం జిల్లాకేంద్రాల్లో ఎంఈవోలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంపిక చేసిన పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఏఐ బోధనపై శిక్షణ పూర్తిచేశారు.
ఉమ్మడి జిల్లాలో అమలు ఏఐ తరగతులను ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతానికి అమలుచేస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కలిపి ఉన్న పాఠశాలలనే ఇందుకు ఎంపికచేశారు. ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లను ఏఐ తరగతులకు వినియోగిస్తున్నారు. 3, 4, 5 తరగతుల్లో విద్యలో వెనుకబడిన సీ-గ్రేడ్ విద్యార్థులను గుర్తించి, వారికి మాత్రమే ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు.ఇందుకోసం ఏఐ పాఠాల కోసం యాక్సెల్-ఎక్‌స్టెప్ ఫౌండేషన్ కంపెనీ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఏఐ పాఠాలు బోధిస్తున్నారు.
విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు : అశోక్ డీఈవో సూర్యాపేట.
విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ పాఠాలు ఎంతో మేలు చేయనున్నాయి. గణితంలో బేసిక్స్‌ను ఏఐ పాఠాల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాల్లోని 3, 4, 5 తరగతుల్లో కొంతమంది విద్యలో రాణించలేకపోతున్నారు. అలాంటి వారికి ఏఐ ద్వారా పాఠాల బోధన మెరుగైన సామర్థ్యాలను సాధించే అవకాశం లేకపోలేదు. ఏఐ పాఠాల కోసం విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి మాత్రమే అందిస్తున్నాం.