AP Police: ‘ఏ 2’ సునీల్ యాదవ్ ఫిర్యాదు... ఐదుగురిపై కేసు
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:10 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదైంది.

ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పులివెందుల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తన తల్లిని అసభ్యకరంగా చూపించారని, ఆ సినిమాను నిలుపుదల చేయాలని ఎస్పీకి సునీల్ యాదవ్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అలాగే ఈ సినిమాలో తన తల్లిపాత్రకు సంబంధించిన అభ్యంతరకర వీడియో క్లిప్‌లను పులివెందులకు చెందిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ పులివెందుల పోలీసులకు, ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై సీఐ నరసింహులు కేసు నమోదు చేశారు. హత్య సినిమాలో కొన్ని అభ్యంతకర సీన్లను సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి పవన్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదైన మిగతా నలుగురి వివరాలు పోలీసులు వెల్లడించలేదు.