అధికారులు సమయ పాలన పాటించాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:34 AM
అధికారులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.

కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అధికారులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ధరణితో నెలకొన్న భూ సమస్యల పరిష్కార విషయంలో సంబంధిత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్‌వర్క్‌పై ప్రతిపాదనలు పంపితే వారిపై చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు జరుగకుండా పటిష్టం చేయడానికి జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నానని, ప్రధానంగా కోర్టు కేసుల రిజిస్టర్లు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని వాటిని పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సమయ పాలన పాటించాలని, క్రమం తప్పకుండా అందరూ సకాలంలో హాజరుకావాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.వేసవిలో నీటి సమస్యను అరికట్టడానికి గ్రామాలవారీగా ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఏఈలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఎక్కడ నీటిసమస్య రాలేదన్నారు.