Share News

సార్‌ చెప్పినా వినరా?

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:32 AM

అసలే ఎండా కాలం.. ఆపై నీటి సమస్య.. దీంతో బొమ్మలరామారం మండలంలోని యావపూర్‌తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించాలని ఆదేశాలివ్వగా.. నేటికీ సమస్య తీరలేదు.

సార్‌ చెప్పినా వినరా?

లో వోల్టేజీ, నీటి సమస్య విన్నవించి నెలరోజులు

కలెక్టర్‌ చెప్పినా పూర్తికాని పనులు

నేడు యావపూర్‌ తండాకు కలెక్టర్‌

బొమ్మలరామారం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అసలే ఎండా కాలం.. ఆపై నీటి సమస్య.. దీంతో బొమ్మలరామారం మండలంలోని యావపూర్‌తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించాలని ఆదేశాలివ్వగా.. నేటికీ సమస్య తీరలేదు. వివరాల్లోకి వెళితే.. గత నెల 20న కలెక్టర్‌ హనుమంతరావు ‘పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా బొమ్మలరామారం మండలంలోని యావపూర్‌ తండాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆరోజు వరకు గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులు సమస్యల పరిష్కారం కోసం అదేరోజు హడాహుడి చేసి వదిలేశారు. నేడు(ఆదివారం) కలెక్టర్‌ గ్రామానికి రానుండడంతో పరిష్కారానికి నోచని సమస్యలను గ్రామస్థులు తిరిగి ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

పరిష్కారానికి నోచని లోవోల్టేజీ సమస్య

యావపూర్‌ తండావాసులు లోవోల్టేజీ సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను ఎన్నోసార్లు విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. గతనెలలో కలెక్టర్‌ పర్యటన సందర్భంలో సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్థులు ఆశించారు. పర్యటనలో భాగంగా కలెక్టర్‌ అదేరోజు సాయంత్రం వరకు ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించి సమస్య పరిష్కరించాలని ట్రాన్స్‌కో జిల్లా అధికారిని ఆదేశించారు. కానీ విద్యుత్‌శాఖ అధికారులు అప్పటికప్పుడు సమస్య పరిష్కరించే విధంగా హడావుడిచేస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ స్తంభాలు తెచ్చిపెట్టారు. కానీ ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్‌కి కనెక్షన్‌ ఇవ్వలేదు. స్థంభాలకు విద్యుత్‌ వైరు తీయలేదు. ఈ విషయంపై గ్రామస్థులు మండల విద్యుత్‌శాఖ అధికారిని అడిగితే తమ దగ్గర బడ్జెట్‌ లేదని విద్యుత్‌ వైర్‌ను తెచ్చుకోవాలని, విద్యుత్‌ శాఖ ఏఈ అంటున్నారని గ్రామస్థులు తెలుపుతున్నారు.

నీటి కోసం తంటాలు తప్పడంలేదు

తండాలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని తండావాసు లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మిషన్‌ భగీరథ ద్వారా గ్రామానికి సరిపడా నీటిని అందించాలని, అవసరమైతే ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టాలని ఆయన ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆరోజు ఆదేశించినా నేటికీ సమస్య పరిష్కారానికి నోచలేదు.

జాడ లేని ఆర్‌అండ్‌బీ అధికారులు

యావపూర్‌ తండాలో రోడ్డుపై ఉన్న గుంతలు, రోడ్డు వెంట వస్తున్న దుమ్ము, ధూళితో గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ అప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతూ గ్రామం వరకు బీటీ రోడ్డును వెంటనే వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ నేటికీ కూడా గ్రామంలో రోడ్డు పనులు మొదలు పెట్టలేదు. ఇలాంటి సమస్యలను గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే, తమ సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని గ్రామస్థులు ఆశపడ్డారు. కానీ నేటికీ సమస్యలు పరిష్కారానికి నోచలేదు. నేడు గ్రామంలో జరిగే వైద్య శిబిరానికి వస్తున్న కలెక్టర్‌ తమ సమస్యలపై ఏం మాట్లాడతారో చూడాలని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

కలెక్టర్‌ చెప్పిన పట్టించుకోరా?తి: రాజు నాయక్‌, గ్రామస్థుడు.

నెల క్రితం గ్రామంలో కలెక్టర్‌ స్వయంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు విన్న వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కానీ జిల్లా, మండల స్థాయి అధికారులు మాత్రం కలెక్టర్‌ అదేశాలను ఏమాత్రం అమలు చేయలేదు. లోవోల్టేజీ సమస్య గురించి గ్రామస్థులంతా ఏఈని అడిగితే బడ్జెట్‌ సమస్య ఉందని తెలుపుతున్నారు.

నీరు రావడం లేదు : ధీరావత్‌ సునీత, గ్రామస్థుడు.

చాలా రోజుల నుంచి గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉంది. నాలుగు రోజులకు ఒకసారి కూడా మిషన్‌ భగీరథ ద్వారా సరిపడా నీరు రావడం లేదు. మిషన్‌ భగీరథ ద్వారా వచ్చే పైపులైన్‌ ధ్వంసంకావడంతో నీరు రావడంలేదని పంచాయతీ కార్యదర్శి సమాధానం ఇస్తున్నారు. నెల క్రితం కలెక్టర్‌ గ్రామానికి వచ్చినప్పుడు తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని అదేశించారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు : నవదీప్‌, మండల విద్యుత్‌ శాఖ అధికారి.

నెల రోజుల క్రితం కలెక్టర్‌ అదేశాల మేరకు లోవోల్టేజీ సమస్య పరిష్కారం కోసం గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశాం. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రారంభించలేదు. నేడు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. గ్రామంలో విద్యుత్‌ స్థంభాలు ఏర్పాటు చేశారు. స్థంభాలు వేసేందుకు విద్యుత్‌ వైరు తమ దగ్గర అందుబాటులో లేదని సమాధానం తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 12:32 AM