Share News

ట్రాక్టర్‌ డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం.. పదేళ్ల జైలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:47 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి 15మంది కూలీల మృతికి కారణమైన నిందితులకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు శిక్ష, జరిమానా ఖరారు చేసింది.

ట్రాక్టర్‌ డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం.. పదేళ్ల జైలు

2018లో వేములకొండలో ట్రాక్టర్‌ బోల్తా ఘటనలో 15 మంది కూలీలు మృతి

నిందితులకు శిక్షలు ఖరారు చేసిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి

యాదాద్రి మార్చి24(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి 15మంది కూలీల మృతికి కారణమైన నిందితులకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు శిక్ష, జరిమానా ఖరారు చేసింది. 2018 జూన్‌ 24న జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదం ఘటనపై దోషులకు 10సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ట్రాక్టర్‌ ప్రమాదానికి కారణమైన నేరస్తులు ఏ-1 ఆలూరి వెంకటరమణ, ఏ2 దూళిపాళ్ల నాగేఽశ్వరరావులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో పాటు ధాన్యం, వ్యవసాయ సామాగ్రిని తరలించేందుకు మాత్రమే ఉపయోగించాల్సిన ట్రాక్టర్‌ను చట్ట విరుద్ధంగా వ్యవసాయ కార్మికులను తరలిస్తూ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ట్రాక్టర్‌ను నడపడంతో మూసీనది కాల్వలో మునిగి 15మంది కూలీలు మృత్యువాత పడ్డారు. 17మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన వీరికి కోర్టు శిక్ష విధించింది. వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో యు/ఎస్‌304(2), 325, 324, 109 ఐపీసీ, సెక్షన్‌ 3(2)(వీ), 3(1)(సీ) ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ నిందితులకు కోర్టు శిక్షను నిర్థారించింది. ఏ-1 నిందితునికి 10సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా, ఏ-2 నిందితుడికి రూ.5వేల జరిమానాను యూ/ఎస్‌ 181 ఆఫ్‌ మోటారు వాహనాల చట్టం ప్రకారం కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌. అఖిల వాదనలు వినిపించారు.

మృతులంతా వ్యవసాయ కూలీలే

వలిగొండ ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన వారంతా కూడా పొట్టకోసం పనిచేసే కూలీలే. వలిగొండలో పత్తి విత్తడానికి కూలీలతో వెలుతున్న ట్రాక్టర్‌ మూసీ కాల్వలో పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో మూడేళ్ల బాలుడితో పాటు 14 మంది మహిళలు ఉన్నారు. మరో 17మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరంతా వలిగొండ మండలం వేములకొండకు చెందిన రెక్కాడితే కానీ గొక్కాడని నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు, చదువుకుంటున్న బాలికలే ఉన్నారు.

బయలు దేరిన పది నిమిషాలలోపే..

వేములకొండ గ్రామానికి గుంటూరు జిల్లా నుంచి వెంకటనారాయణ అలియాస్‌ వెంకట్రావ్‌ దాదాపు పది సంవత్సరాల క్రితం వలస వచ్చాడు.. వేముల కొండగ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తుల వద్ద దాదాపు 40ఎకరాల రేగడి భూములను కౌలుకు తీసుకుని పత్తిసాగు చేసేవాడు. ఈ నేపద్యంలో పత్తి సాగుచేయడానికి దుక్కి సిద్ధం చేసిన కౌలు రైతు వెంకటనారాయణ పత్తి విత్తడానికి గ్రామంలో దాదాపు 30మంది కూలీలను తన సొంత ట్రాక్టర్‌లో ఎక్కించుకుని ఉదయం 9.30గంటల సమయంలో రేగడికి బయలు దేరాడు. వేముల కొండనుంచి బయలుదేరిన 10నిమిషాల్లోనే మూసీ కాల్వ కట్టపై ట్రాక్టర్‌ పల్టీకొట్టింది. అతివేగంగా వెళుతుండగా అదుపుతప్పిన ట్రాక్టర్‌ ట్రాలీ కోళ్లగూడు మాదిరి మూసీ నీటి కాలువలో పల్టీ కొట్టడంతో అందులో చిక్కుకు పోయిన 14మంది మహిళలతో పాటు మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌ అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళతుందని గమనించిన ఇంజన్‌పై కూర్చున్నవారు, ట్రాలీ పక్క డోర్లపై కూర్చున్న యువతులు, మహిళలు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ట్రాక్టర్‌ పల్టీ కొడుతుండగా చూసిన ఓ బాలిక కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి చెప్పడంతో హుటాహుటిన గ్రామస్తులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాలీ కింద చిక్కుకున్నవారిని రక్షించారు.

మృతులు: ఎనుగుల మాధవి(30), బీసు కవిత(20), కాడిగల్ల లక్ష్మమ్మ(40), కాడిగల్ల మానస(18), కాడిగల్ల నర్మద(25), ఇంజమూరి శంకరమ్మ(32), ఇంజమూరి నర్సమ్మ(50), అంబాల రాములమ్మ(60), అరూర్‌ మణెమ్మ(30), గండెబోయిన అండాలు(35), బోయ శకుంతల(35), బోయ మల్లికార్జున్‌(3), జడిగె మారమ్మ(55), బందారపు స్వరూప(35), పంజాల భాగ్యమ్మ(30) ఉన్నారు.

క్షతగాత్రులు: కన్నెబోయిన మంజుల, జోగు శాంతమ్మ, రత్నకుమారి, కాడింగుల హేమలత, మంటిపెల్లి లక్ష్మమ్మ, అంబాల సోములమ్మ, వింజమూరి లక్ష్మమ్మ, రాపోలు జయమ్మ, బొంగు లక్ష్మమ్మ, కాడిగళ్ల అఖిల , కాడిగల్ల తేజ, కొత్త అనిత, బొంత మంజుల ఉన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:47 AM