Medical Negligence: సిజేరియన్ ఆపరేషన్.. 17 ఏళ్ల తరువాత మహిళ కడుపులో కత్తెర తొలగింపు
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:38 PM
లఖ్‌నవూలో తాజా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యురాలి పొరపాటు కారణంగా మహిళ కడుపులో ఇరుక్కుపోయిన కత్తెరను వైద్యులు దాదాపు 17 ఏళ్ల తరువాత తొలగించారు. నాడు మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యురాలిపై రోగి భర్త తాజాగా కేసు వేశారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో వైద్యులను దైవాలుగా భావిస్తారు. తమ ప్రాణాలను కాపాడతారన్న ఉద్దేశంతో ఎంతో గౌరవిస్తారు. కానీ కొందరు వైద్యులు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. వైద్య వృత్తిని స్వీకరించేటప్పుడు చేసిన ప్రమాణాన్ని కూడా మరిచి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు సంబంధించిన తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కడుపులో కత్తెరతో ఓ మహిళ ఏకంగా 17 ఏళ్ల పాటు నరకం అనుభవించింది (Scissors in Woman's stomach removed after 17 years).
రాష్ట్రంలోని లఖనవూ నగరంలో ఇటీవల ఈ ఉదంతం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం, సంధ్య పాండే అనే మహిళకు 2008లో నగరంలోని ‘షీ మెడికల్ కేర్’ అనే నర్సింగ్ ఆసుపత్రిలో సీజేరియన్ ఆపరేషన్ జరిగింది. నాటి నుంచి సంధ్యకు కడుపులో నొప్పి మొదలైందని ఆమె భర్త అరవింద్ పాండే తెలిపాడు. ఎందరు వైద్యులను సంప్రదించినా ఆమె సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో, ఆమె ఇన్నేళ్లుగా నిత్య నరకం అనుభవించింది.
Also Read: జాబ్ చేసే వారికి సమస్యలు తెచ్చిపెట్టే అలవాట్లు ఇవే
ఇటీవల ఆ దంపతులు లఖ్‌నవూ మెడికల్ కాలేజీలో చికిత్సకు వెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీయగా సంధ్య కడుపులో కత్తెర ఉన్నట్టు వెలుగులోకి వచ్చిది. ఆ తరువాత బాధితురాలు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేరింది. మార్చి 26న వైద్యులు ఆమె కడుపులోని కత్తెరను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ఆసుపత్రి అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆపరేషన్ కొంచెం సంక్లిష్టమైనా విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఆమె కడుపులో కత్తెరను తొలగించామని అన్నారు. ఆమె కోలుకున్నాక డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు.
Also Read: ఈ విషయాలను బయటవారికి ఎప్పుడూ చెప్పొద్దు
తన భార్యకు ఆపరేషన్ చేసిన డా.పుష్ప జైస్వాల్‌పై కేసు పెట్టినట్టు అరవింద్ పాండే వెల్లడించారు. డాక్టర్ నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులూ దేశంలో రోజూ వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, వైద్యపొరపాట్ల కారణంగా సంభవించిన మరణాల్లో 80 శాతం సర్జరీల్లోనే జరిగినట్టు అధ్యయనంలో తేలింది.