Share News

Uber Olas New Competitor: ఓలా, ఉబర్‌‌లకు షాక్.. కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:07 PM

ఓలా, ఉబర్‌ల దోపిడికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. డ్రైవర్లకు లాభాలు కలిగించేలా కొత్త తరహా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు.

Uber Olas New Competitor: ఓలా, ఉబర్‌‌లకు షాక్.. కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే
Sahkar Taxi

పట్టణాలు, నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాహనాల వినియోగం పెరిగిపోతుంది. నగరాల్లో ఉద్యోగం చేసే వారికి సొంత వాహనం తప్పనిసరి. లేకపోతే బస్సులో పడి ఆఫీసుకు చేరాలంటే చాలా కష్టం. సొంతంగా వాహనాలు లేని వారు.. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడుతుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓలా, ఉబర్ వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో కార్, బైక్, ఆటో బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక ఈ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల వద్ద నుంచి ఆయా కంపెనీలు కొంత మొత్తం వసూలు చేస్తాయి. దీని వల్ల డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. ఈసమస్యకు చెక్ పెట్టి.. డ్రైవర్లకు మేలు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగనుంది. ఓలా, ఉబర్‌లకు పోటీగా కొత్త యాప్ తీసుకురాబోతుంది. ఆ వివరాలు..


ఓలా, ఉబర్‌ల దోపడికి చెక్ పెట్టి.. డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం.. సహకార్ టాక్సీని తీసుకురాబోతున్నట్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఉబర్‌లా మాదిరి రైడ్ సర్వీస్‌లను అందిస్తుందని.. తెలిపారు. టూ వీలర్స్, టాక్సీలు, ఆటోలు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని అమిత్ షా తెలిపారు. అంతేకాక ఈ సహకార్ టాక్సీ యాప్.. ఓలా, ఉబర్‌లా మాదిరి డ్రైవర్స్ దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయదని.. మొత్తం వారికే చెల్లిస్తామని తెలిపారు.


సాధారణంగా ఓలా, ఉబర్ వంటి కంపెనీలు.. కస్టమర్‌ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. దీనిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార దిశగా ఆలోచించిన కేంద్ర.. సహకారీ టాక్సీ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. "మా నినాదం సహకార్ సే సమృద్ధి. అయితే దీన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయము. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ సహకార్ యాప్‌ తయారీ కోసం.. మా ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసింది. డ్రైవర్లకు లాభాలు అందించే ఈ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాము" అని చెప్పుకొచ్చారు.


ఓలా, ఉబర్‌లలో ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అలానే మనం వినియోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి కూడా రైడ్ ఛార్జీలు మారుతుంటాయి. తాజాగా రైడ్ బుకింగ్ అనే అంశం.. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెల్లడించాయి. దాంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ ఆరోపణలను ఓలా ఖండించింది. ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ధరలు మారతాయనే దాన్ని తోసిపుచ్చింది. "మా కస్టమర్లందరికీ మేము ఒకే విధమైన ధరలు అందిస్తున్నాం. సెల్‌ఫోన్ ఆధారంగా ధర నిర్ణయించడం లేదు" అని వెల్లడించింది. అలానే ఉబర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను తీసుకురానుండటంపై ఉబర్‌, ఓలాలకు షాక్ అనే చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఇన్‌బిల్ట్‌ కాలర్‌ ఐడీ

ఎట్టకేలకు తేజ్‌సకు అమెరికా ఇంజన్లు

Updated Date - Mar 27 , 2025 | 12:08 PM