BC communities: రేపు బీసీల పోరుగర్జన
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:39 AM
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీఎస్పీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పార్టీల నేతలు ధర్నాలో పాల్గొననున్నారు. ఈ ధర్నా ద్వారా 9వ షెడ్యూల్‌లో బీసీ బిల్లులను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం లక్ష్యం.

ఢిల్లీకి అఖిలపక్ష నేతలు.. కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేశ్‌గౌడ్, పొన్నం, సురేఖ
ధర్నాలో పాల్గొననున్న కనిమొళి, అసద్, మధుసూదనా చారి, శ్రీనివా్‌సగౌడ్, డి.రాజా
ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు.. చర్లపల్లి నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు.. రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎ్‌సతోపాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిల పక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు బీసీ ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈ బృందం... బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా.. బుధ, గురు వారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది.
ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సహకారాన్ని తీసుకోనుంది. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక, బీఆర్‌ఎ్‌స నుంచి మధుసూధనాచారి, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్, సీపీఐ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీజేఎస్ అధినేత కోదండరాం ధర్నాకు హాజరు కానున్నారు. కాగా, రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న డీఎంకే తరఫున కనిమొళి మహా ధర్నాలో పాల్గొననున్నారు. మరోవైపు.. అసెంబ్లీలో బీసీ బిల్లులకు తెలంగాణ బీజేపీ మద్దతు ఇచ్చినా.. మహాధర్నాలో ఆ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు సైతం ఈ ధర్నాలో పాల్గొని మద్దతు తెలపనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జాజుల .. మంగళవారం వివిధ పార్టీలు, సంఘాల నేతలను కలిసి మహాధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలులో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీసీ బిల్లులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఈ వేదిక ద్వారా బీసీ సంఘాల నేతలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, నియోజకవర్గ పునర్విభజనపై చైన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. బీసీ అంశంపైన నిర్వహించనున్న మహాధర్నాలో ఒకే వేదిక పంచుకోనున్నాయి.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News