Revanth Reddy: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:43 AM
మధ్యప్రదేశ్ సభలో తాను మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించారని, బిహార్‌లో కూడా తన గురించి మాట్లాడారని వివరించారు.

ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు
అనిరుధ్ రెడ్డి పిలిస్తే పది మంది ఎమ్మెల్యేలు వెళతారా!?
వాళ్లు విందు చేసుకుంటే తిరుగుబాటని వక్రీకరించారు
కేటీఆర్‌ను అర్జెంటుగా అరెస్టు చేసి జైల్లో వేయాలని లేదు
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దాం
మేం చేసిన సర్వేలో బీసీలు పెరిగారు.. ఓసీలు తగ్గారు
కేసీఆర్ సర్వే తప్పుల తడక.. ముస్లింల లెక్క తేల్చలేదు
మా సర్వేతో కోటా కోసం కోర్టుకెళ్లేందుకు వారికి చాన్స్
ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి, బీజేపీయే
కులగణన, పీసీసీ కార్యవర్గంపైనే అధిష్ఠానంతో చర్చ
మంత్రివర్గ విస్తరణ అధిష్ఠానం అభిప్రాయం ప్రకారమే..
ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తనకూ, రాహుల్ గాంధీకి మధ్య ఎంతో అగాధం ఉందని, తనకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ సభలో తాను మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించారని, బిహార్‌లో కూడా తన గురించి మాట్లాడారని వివరించారు. కులగణనపై రాహుల్‌తో ఎప్పటికప్పుడు చర్చించానని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం లేకుండా కులగణనను జరిపించి అసెంబ్లీలో ప్రవేశపెడతామా? అని ప్రశ్నించారు. రాహుల్‌తో తనకున్న సన్నిహిత సంబంధాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, గతంలో చంద్రబాబునాయుడుతో పని చేసినప్పుడు కూడా ఆయన తనపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం చేశారని తప్పుబట్టారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు చేస్తున్నారన్న కథనాలనూ కొట్టిపారేశారు. వారు సరదాగా కూర్చుని విందు చేసుకుంటే చిలువలు పలవలు అల్లి ప్రచారం చేశారని నవ్వుతూ బదులిచ్చారు. ‘అనిరుధ్ రెడ్డి పిలిస్తే పది మంది ఎమ్మెల్యేలు వెళతారా?’ అని ప్రశ్నించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్‌కు నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడేందుకు జూపల్లి కృష్ణారావును లెటర్ ఇచ్చి తానే బెంగళూరు పంపానని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో ఈసారి కులగణనపై, పీసీసీ కార్యవర్గంపై మాత్రమే చర్చలు జరిగాయని, మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటానని రేవంత్ చెప్పారు. ఎవరి పేర్లనూ తాను సిఫారసు చేయడం లేదని వివరించారు.
అర్జంటుగా జైల్లో వేయాలన్న ఆలోచన లేదు
ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టుల విషయంలో చట్టప్రకారం నడుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అర్జెంట్‌గా అరెస్టు చేసి జైల్లో వేయాలన్న యోచన తనకు లేదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో లండన్ కంపెనీకి నోటీసు ఇచ్చామని, వారు టైమ్ అడిగారని, వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత పర్యవసానాలు ఉంటాయని తెలిపారు. కేటీఆర్ అరెస్టు ఆగిపోవడంపై మాట్లాడుతూ.. పకడ్బందీగా ఆధారాలు లేకుండా అరెస్టు అయితే బెయిల్‌పై బయటకు వస్తారని వివరించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఏమి చెబుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు గతంలో రహస్య స్నేహం ఉండేదని, అది ఇప్పుడు బహిరంగం అయిందని, అందుకే ఢిల్లీ వచ్చిన కేటీఆర్ ఇద్దరు మంత్రులను కలిశారని అన్నారు. సినీ నటుడు నాగార్జున ప్రధాని మోదీని కలిశారని విలేకరులు ప్రస్తావించగా.. ఆయన భూ ఆక్రమణ గురించి 2016లోనే మాట్లాడానని, అధికారంలోకి వచ్చాక చర్య తీసుకున్నానని తెలిపారు. ఆక్రమించారు కనుకే మునిసిపల్ టాక్స్ కట్టలేదని చెప్పారు.
బీసీలు పెరిగారు.. ఓసీలు తగ్గారు
తన ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వేలో బీసీలు 5.5 శాతం పెరిగారని, ఓసీలు 5.5 శాతం తగ్గారని సీఎం చెప్పారు. తమ సర్వేలో బీసీలు తగ్గి, ఓసీలు పెరిగారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ‘‘వందేళ్లుగా ఇలాంటి లెక్కలు లేవు. ఇప్పుడు పకడ్బందీగా కులగణన చేయించి ప్రజల ముందు పెట్టాం. ఈ వివరాలపై క్యాబినెట్ ద్వారా చట్టం చేస్తాం. ఈ వివరాల ప్రాతిపదికగా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం’’ అని వివరించారు. వర్గీకరణకు శాసనసభ ఆమోద ముద్ర వేసిందని, ఇక చట్టం చేయడమే మిగిలిందని చెప్పారు.
పద్మ భూషణ్ రావాలనుకుంటున్నారేమో..
మాదిగలు, ఉప కులాల రిజర్వేషన్ 9 శాతానికి పెరిగిందని, గ్రూప్-1లో ఉన్న అత్యంత వెనకబడిన వర్గాల ఉప కులాలను కూడా కలిపితే 10 శాతం అవుతుందని సీఎం రేవంత్ చెప్పారు. ఎన్నడూ ఏ ఉద్యోగం చూడని వారిని కలిపి గ్రూప్-1లో చేర్చామన్నారు. ఈ సందర్భంగా మాదిగలకు 11 ు రిజర్వేషన్ ఇవ్వాలని మంద కృష్ణ డిమాండ్ చేస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ రావాలనుకుంటున్నారేమో అని రేవంత్ రెడ్డి చమత్కరించారు. సుప్రీం కోర్టు, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ క్రీమీలేయర్‌ను అమలు చేయాలని చెప్పినా తాము తిరస్కరించామని తెలిపారు.
మోదీ కన్వర్టెడ్ ఓబీసీ
ప్రధాని మోదీ కన్వర్టెడ్ ఓబీసీ అని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన కులాన్ని మార్చుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఓబీసీల గురించి తనకు పాఠాలు చెప్పే అర్హత బీజేపీకి లేదన్నారు. ‘‘కిషన్ రెడ్డి ఓబీసీ అయిన దత్తాత్రేయ స్థానంలో పోటీ చేశారు. మరో ఓబీసీ అయిన సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. ఆ ఇద్దరి స్థానాలను లాక్కున్నది కిషన్ రెడ్డే’’ అని ఆరోపించారు. ఆంధ్రాలో కాపు అధ్యక్షుడిని తీసేసి అగ్రవర్ణానికి చెందిన వారిని నియమించారని, ఓబీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడేది వీళ్లా అని రేవంత్ మండిపడ్డారు.
కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు ముస్లింకు చాన్స్
‘‘కేసీఆర్ ప్రభుత్వం బీసీలుగా ప్రకటించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లింలను ఆయన ప్రత్యేకంగా చూపించలేదు. ముస్లింల గణాంక వివరాలు లేనందువల్ల సుప్రీంకోర్టులో కోటాపై స్టే విధించారు. ఇప్పుడు లభించిన ముస్లింల గణాంక వివరాల ఆధారంగా వారు రిజర్వేషన్ కోసం కోర్టుకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి’’ అని ముఖ్యమంత్రి వివరించారు. బీసీలతో సంబంధం లేకుండా వారు రిజర్వేషన్లు పొందేందుకు వీలు కలిగిందని చెప్పారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం జరిపించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం బీసీలు, 21 శాతం ఓసీలు, 18 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని, అప్పుడు ముస్లింలను బీసీల్లో పరిగణించి లెక్కించారని గుర్తు చేశారు. తాము జరిపించిన సర్వేలో బీసీలను ‘ఏబీసీడీఈ’గా వర్గీకరించారని, ముస్లింలను ‘ఈ కేటగిరీ’లో చేర్చామని తెలిపారు. ఏబీసీడీలకు చెందిన బీసీలు 46.25 శాతం, ముస్లింలు 10.8 శాతం ఉన్నారని, ఇద్దర్నీ కలిపితే 56.33 శాతం ఉన్నారని చెప్పారు. హిందూ ఆచారాలను పాటించే ఓసీలు 12.5 శాతం, ముస్లిం ఆచారాలను పాటించే ఓసీలు 3 శాతానికిపైగా ఉన్నారని, మొత్తం కలిపితే 15.5 శాతానికిపైగా ఓసీలు ఉన్నారని వివరించారు. ఎస్సీలు 17.45 శాతం, ఎస్టీలు 10.06 శాతం మేరకు ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో నిర్వహించిన సర్వేలో ఓసీలు 21 శాతం ఉంటే.. తమ సర్వేలో 15.5 శాతానికి తగ్గారని, అటువంటప్పుడు ఓసీలు పెరిగారని ఎలా అంటారని రేవంత్ ప్రశ్నించారు.
దళితుల్లో సగం మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, క్రైస్తవులుగా ఉన్నవారు తమది క్రైస్తవ మతమని చెప్పుకోలేదని తెలిపారు. కేసీఆర్ జరిపించిన సర్వే తప్పుడు తడకలుగా ఉందని, స్పెల్లింగ్ మిస్టేక్‌ను కూడా చూసుకోకుండా కులాల సంఖ్యను పెంచారని తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు 82 ఉన్నాయని రాశారని, ఉన్నవి 59 ఉప కులాలైతే మిగతావి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘మోచీ’ అన్న పదం స్పెల్లింగ్ ఒకరు ఒకరకంగా రాస్తే మరొకరు ఇంకో రకంగా రాశారని, రెండింటినీ వేర్వేరు కులాలుగా పేర్కొన్నారని తప్పుబట్టారు. కేసీఆర్ మాదిరిగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీ పిల్లలను పంపించి కేవలం 12 గంటల్లో తమ ప్రభుత్వం సర్వే జరిపించలేదని, సర్వే ఎలా చేశామో తాను అసెంబ్లీలో వివరించానని చెప్పారు. తమ సర్వే అత్యంత శాస్త్రీయమైనదన్నారు. తాను జరిపించిన సర్వేలో 33వ పేజీ తెరిచి చదువుకొమ్మని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్‌కు సభలోనే చెప్పానని, తీన్మార్ మల్లన్న ఏమి ఆశించి దాన్ని వ్యతిరేకించారో తనకు తెలియదని, బహుశా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాడేమోనని రేవంత్ వ్యాఖ్యానించారు.
తమ సంక్షేమాన్ని చరిత్ర రికార్డు చేస్తుంది
వీసీ నియామకాలపై యూజీసీ మార్గదర్శక సూత్రాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశామని, ముఖ్యమంత్రుల సమావేశానికి శ్రీధర్‌బాబు వెళ్లారని రేవంత్ చెప్పారు. తాను తీసుకున్న సంక్షేమ చర్యలు, నిర్ణయాలను చరిత్ర రికార్డు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..