Share News

CM Revanth Reddy: లోక్‌సభ సీట్లు పెంచొద్దు!

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:05 AM

నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లోని శాసనసభలకు మాత్రమే చేపట్టాలని, తెలంగాణ శాసనసభ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

CM Revanth Reddy: లోక్‌సభ సీట్లు పెంచొద్దు!

  • కేంద్ర చర్యల్లో పారదర్శకతేదీ?.. అందర్నీ సంప్రదించే నిర్ణయించాలి

  • రాష్ట్రాలవరకే పునర్విభజన.. రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి

  • శాసనసభలో తీర్మానం ఆమోదం

  • కేంద్రం వినకపోతే పోరాటానికి కూడా సిద్ధం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లోని శాసనసభలకు మాత్రమే చేపట్టాలని, తెలంగాణ శాసనసభ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను యధావిధిగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని కోరింది. శాసనసభ సీట్ల పెంపునకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రం తెర మీదకు తెచ్చిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, స్థానాల పెంపు ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా కేంద్రంతో చర్చలు జరపాలన్నారు. కేంద్రం మన మాట వినకపోతే పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, కేశవరావుల నేతృత్వంలో పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


పార్టీలు, ప్రజాసంఘాల వారంతా ఆ సమావేశానికి హాజరై అభిప్రాయాలనుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, పెంపులను జనాభా ప్రాతిపదికన చేయాలని చూస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. 1975లో, 2022లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి వచ్చినపుడు అప్పటి ప్రధానులు ఇందిరాగాంధీ, వాజ్‌పేయి చాలా దూరదృష్టితో ఆలోచించి పాతికేళ్ల పాటు వాయిదా వేయించారని చెప్పారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ వారిద్దరిలా రాజనీతిజ్ఞతతో ఆలోచించడం లేదని విమర్శించారు. 543 సీట్లున్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 130 సీట్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం లోక్‌సభ సీట్లలో దక్షిణాది వాటా 24 శాతమని తెలిపారు. మోదీ ఆలోచన ప్రకారం చేస్తే అది 19 శాతానికి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి తెలంగాణ తరఫున వెళ్లామని చెప్పారు. దక్షిణాదికి నష్టం జరిగే విధంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే కలసికట్టుగా ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అసలు కేంద్రం నిర్ణయమే తీసుకోలేదని కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్నారని, అందులో నిజం లేదని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన జనాభా నియంత్రణ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేయడంతో దక్షిణాది జనాభా బాగా తగ్గిందని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. అదే సమయంలో కేంద్రం కార్యక్రమాలను అమలు చేయని బిహార్‌, రాజస్థాన్‌, చత్తీ్‌సఘడ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జనాభా బాగా పెరిగిందని చెప్పారు. కేంద్రం చెప్పినమాట విన్నందుకు రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీకి పెద్దగా అవకాశం ఇవ్వని దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా నియంత్రించేందుకు కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనను ఒక అస్త్రంగా చేసుకుంటోందని రేవంత్‌ ఆరోపించారు.


కేంద్రం ద్వంద్వ వైఖరి

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉండగా పట్టించుకోకుండా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా చేపడతామని కేంద్రం దాటవేసిందని రేవంత్‌ ప్రస్తావించారు. స్వప్రయోజనాల కోసం జమ్మూ కశ్మీర్‌లో 83గా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను 90కి పెంచారని ప్రస్తావించారు. సిక్కింలో కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పక్కాగా ఉన్నా, తెలంగాణ, ఏపీలతో పెద్దగా ప్రయోజనం లేదని సీట్ల పెంపును పట్టించుకోలేదన్నారు. కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న సమాచారం, మంత్రులు కల్పిస్తున్న భ్రమలు, ఢిల్లీలో తీసుకుంటున్న నిర్ణయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అవలంభిస్తున్న ద్వంద్వ విధానాల వలనే ఆందోళన చెందాల్సి వస్తోందని, సభలో పునర్విభజనపై తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా అదే కారణమని చెప్పారు. కేంద్రం ఆర్థిక వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటిదాకా నష్టపోతున్నాయని, పునర్విభజనను అంగీకరిస్తే రాజకీయంగా కూడా నష్టపోతామని, ఇందుకు ఎంతమాత్రం అంగీకరించేది లేదని చెప్పారు. కేంద్రం అనుకున్నట్లే చేస్తే దక్షిణాది ప్రజల ఓటుతో సంబంధం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రణాళికబద్ధంగా దక్షిణాదిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.


తీర్మానంలో ఏం ఉందంటే

‘‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తరువాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని సభ కోరుతోంది. కేంద్రం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్ధేశంతో చేపట్టిన 42, 84, 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. లోక్‌సభ సీట్లను యధాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలి. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలి’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు కోరగా, తీర్మానం ఆమోదం పొందిందని స్పీకర్‌ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:05 AM