నీటి పారుదలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:50 AM
నీటిపారుదల శాఖకు రూ.23,354 కోట్లు కేటాయించారు. ఇందులో.. కృష్ణా, గోదావరి పరీవాహకంలో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.8,774 కోట్లను ప్రతిపాదించారు.

రైతు పక్షపాత ప్రభుత్వం మాది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖకు రూ.23,354 కోట్లు కేటాయించారు. ఇందులో.. కృష్ణా, గోదావరి పరీవాహకంలో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.8,774 కోట్లను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో 4,22,911 ఎకరాలను 2025-26లో సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రూ.23,354 కోట్లలో రుణాల చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, ప్రాజెక్టుల నిర్వహణకు గాను రూ.12,500 కోట్లు పోతే.. మిగతా రూ.10,754 కోట్లను ప్రాజెక్టుల నిర్మాణాలకు వెచ్చించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.19,349.24 కోట్లు కేటాయించగా.. 2023-24లో రూ.29,766 కోట్లు, 2024-25లో రూ.22,284.96 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సారి కేటాయింపులు రూ.1,069.99 కోట్లమేర పెరిగాయి. కాగా, తాజా బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పూర్తిచేస్తాం. నల్లగొండతోపాటు.. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న 107 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తాం. మూసీ ప్రాజెక్టు పరీవాకంలో.. బునియాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కోసం రూ.266.65 కోట్లు కేటాయించాం. కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రతి నీటి చుక్కను లెక్కించడానికి టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు కృష్ణాబోర్డుకు తగిన నిధులను ఇస్తాం. పౌరసరఫరాల శాఖకు రూ.5734 కోట్లు కేటాయించడంతో లక్షల మందికి ఆహార భద్రత లభిస్తుంది. సన్నాలకు బోనస్ ప్రకటించడం వల్లే.. సాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు చేరింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులకు కేటాయింపులిలా..
కాళేశ్వరం ఎత్తిపోతల 2,684
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల 1,714
కల్వకుర్తి ఎత్తిపోతల 1,058
ఏఎమ్మార్ ఎస్‌ఎల్‌బీసీ 1,150
డిండి ఎత్తిపోతల 950
రాజీవ్-బీమా ఎత్తిపోతల 891
మూసీ ప్రాజెక్టు 266.65