CM Revanth: సన్న బియ్యం మన బ్రాండ్
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:44 AM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రేరేపించారు, ఇది ప్రజల కోసం శాశ్వత పరిష్కారం అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, భూ భారతి వంటి పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పథకమూ మనదే.. పేటెంటూ మనదే.. ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది
కుల గణన.. మోదీ సర్కారుకు మరణ శాసనం
దేశంలోనే గేమ్ చేంజర్.. బిహార్
ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది
కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం
ఇప్పుడు మోదీ కూడా రంగంలోకి దిగారు
ఏఐ ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతోందన్నారు
సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం.. ఆనాటి రూ.2కే కిలో బియ్యం తరహాలో శాశ్వతంగా గుర్తుండిపోనుంది. సన్న బియ్యం.. మన పథకం. మన బ్రాండ్. ఈ పథకం పేటెంటూ మనదే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పథకం ఎందుకు అమలు కావట్లేదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. దేశంలో ప్రస్తుతం తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందని, అందుకే, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం సీఎల్సీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా సన్న బియ్యం, కుల గణన, ఎస్సీ వర్గీకరణ, భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సన్న బియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణ అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. బీసీ కుల గణనపై మంత్రి పొన్నం ప్రభాకర్.. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.
కుల గణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా, పకడ్బందీగా పరిష్కరించాం. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులను తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇది నిదర్శనం. ఇక, జఠిలమైన ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపాం. వర్గీకరణ చట్టం అమలయ్యే వరకూ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చాం. దీనిని రైతులకు చేరవేయాలి. ఇక, ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందాలి. కుల గణన, సన్న బియ్యం, ఎస్సీ వర్గీకరణ, భూ భారతి వంటి గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి జూన్ 2 వరకు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్నీ పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం కావడానికి సమయం కేటాయిస్తానని చెప్పారు. మనం ఎంత మంచి పని చేసినా.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని, పార్టీ.. ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగితేనే మనకూ భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారి వద్దకు తీసుకెళ్లాలని వివరించారు.
వర్గీకరణ, కుల గణన.. గొప్ప గొప్ప నాయకులే చేయలేక పోయారు: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకెత్తయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన మరొక ఎత్తని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాలను గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారని, కానీ, మన ప్రభుత్వం చెప్పి మరీ చేసి చూపించిందని అన్నారు. ఇప్పుడు ఈ రెండు అంశాలను అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలైందన్నారు. కొద్దిమందికి ఇష్టం లేకపోయినా దేశంలో భూ సంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, అందుకే, సుదీర్ఘ కాలంపాటు అధికారంలో కొనసాగిందని చెప్పారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను మూటకట్టి మూలన పడేసే విషయాలన్నారు. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నాయని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి
‘‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎస్సీ వర్గీకరణ ఆయనకు గుదిబండగా మారింది. కుల గణన సర్వే.. కేంద్రంలోని మోదీ సర్కారుకు మరణ శాసనం రాయబోతోంది. దేశంలోనే ఇది గేమ్ చేంజర్ కానుంది. బిహార్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కంచగచ్చిబౌలి భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అబద్ధపు ప్రచారం చేసిందని, దానిని ప్రధాని మోదీ కూడా నమ్మి.. తెలంగాణ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు పంపిస్తోందంటూ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, ఇప్పటి దాకా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేశారని, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని వ్యాఖ్యానించారు.