సులభతర వాణిజ్య విధానం భేష్: కేంద్ర బృందం
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:04 AM
ఈ సందర్భంగా ఈవోడీబీపై చర్చించారు. సులభతర వాణిజ్య విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని సీఎస్ వారికి వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నారు.

అభివృద్ధికి ఆటంకంగా అటవీ చట్టాలు: సీఎస్
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సులభతర వాణిజ్య విధానాని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స)కి కేంద్ర బృందం కితాబిచ్చింది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ఉన్నతాధికారి సుకృతి లిఖి నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఈవోడీబీపై చర్చించారు. సులభతర వాణిజ్య విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని సీఎస్ వారికి వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నారు.
ఇప్పటికే సంస్కరణలు చేపట్టామన్నారు. వాణిజ్య భవనాలకు త్వరితగతిన అనుమతులివ్వడానికి ‘బిల్డ్ నౌ’, ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించామని, భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ వ్యవస్థను తీసుకొచ్చామని వివరించారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ, వన్యప్రాణుల చట్టాల అనుమతులు సకాలంలో లభించడం లేదని, దాంతో అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందని సీఎస్ కేంద్ర బృందానికి వివరించారు. ఈవోడీబీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రధా న సంస్కరణలు, కార్యక్రమాలు బాగున్నాయని సుకృతి లిఖి కితాబిచ్చారు.