Share News

Alcohol Sales Growth: 30 వేల కోట్ల మద్యం తాగారు

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:57 AM

2024-25లో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి, కానీ విలువలో కేవలం 0.34%నే పెరుగుదల. కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం మరియు ధరల తగ్గింపు వల్ల 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి

Alcohol Sales Growth: 30 వేల కోట్ల మద్యం తాగారు

  • రోజుకు రూ.83 కోట్ల విలువైన 78,676 కేసుల అమ్మకం

  • 2024-25లో పెరిగిన విక్రయాల జోరు

  • కర్నూలులో అత్యధికం.. నెల్లూరులో అత్యల్పం

  • వినియోగదారులపై బాగా తగ్గిన లిక్కర్‌ భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో రూ.30వేల కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారు. సగటున రోజుకు రూ.83.38 కోట్ల విలువైన 78,676 కేసుల మందు అమ్ముడైంది.అయితే, ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా వాటి విలువ పరంగా ఆ స్థాయి పెంపు కనిపించడం లేదు. 2023-24తో పోలిస్తే 2024-25లో 9.1శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ మాత్రం కేవలం 0.34శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా క్వార్టర్‌ రూ.99 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్లు ధరలు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్టు మద్యం తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో.. కడపలో 4.36 శాతం, విశాఖపట్నంలో 3.36శాతం, ప్రకాశంలో 2.68శాతం, నంద్యాలలో 2.66శాతం, విజయనగరంలో 2.45శాతం, పల్నాడులో 2.32శాతం, బాపట్లలో 2.27శాతం, కృష్ణాలో 1.83శాతం, అనకాపల్లిలో 1.77శాతం, శ్రీకాకుళంలో 1.39శాతం, పార్వతీపురం మన్యంలో 1.34శాతం, నెల్లూరులో 1.32శాతం మేర అమ్మకాలు తగ్గాయి. మిగిలిన 14 జిల్లాల్లో అమ్మకాలు పెరిగాయి. అత్యధికంగా కర్నూలులో 13.63శాతం, చిత్తూరులో 11.71శాతం, శ్రీసత్యసాయిలో 10.22శాతం మేర అమ్మకాలు పెరిగాయి. మొత్తంగా 2023-24లో 4.55కోట్ల కేసులు అమ్మగా, 2024-25లో 4.97కోట్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్‌ 7.38శాతం, బీరు 14.13శాతం పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02లక్షల కేసుల లిక్కర్‌, 16.47లక్షల కేసుల బీరు అమ్మకాలు పెరిగాయి.


మద్యం ప్రియులకు ఉపశమనం..

వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెంచిన ధరలతో మద్యం వినియోగదారుల జేబుకు చిల్లు పడింది. ఒకేసారి ధరలు రెట్టింపు చేయడంతో పేదలు దోపిడీకి గురయ్యారు. ఆ తర్వాత ధరలు తగ్గించినా పక్క రాష్ర్టాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ ధరలే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్వార్టర్‌ రూ.99 మద్యం అందుబాటులోకి వచ్చింది. అది కూడా జాతీయ స్థాయి బ్రాండ్లు క్వార్టర్‌ రూ.99 మద్యాన్ని తయారుచేస్తున్నాయి. దీంతో మొత్తం అమ్మకాల్లో రూ.99 బ్రాండ్ల వాటా 30శాతానికి చేరింది. మరోవైపు గత ప్రభుత్వంలో అధిక ధరలకు మద్యం అమ్మిన పలు బ్రాండ్లు ధరలు తగ్గించుకున్నాయి. దీంతో అమ్మకాల్లో పరిమాణం పెరిగినా, విలువలో ఆ స్థాయి పెంపు కనిపించలేదు. మొత్తంగా మద్యం ప్రియులకు ఉపశమనం కలిగింది. కాగా, అమ్మకాలు పెరిగినా, విలువ పెరగకపోవడంతో ఆదాయంపైనా ప్రతికూలత కనిపిస్తోంది. 2023-24లో రూ.30వేల కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు రూ.25,082 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది స్వల్పంగా విలువ పెరిగి రూ.30,183 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో అంతకుముందు ఏడాది స్థాయిలోనే ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,800 కోట్లు వచ్చాయి.


మళ్లీ పాపులర్‌ బ్రాండ్లు

జగన్‌ ప్రభుత్వంలో జే బ్రాండ్లు పేరుతో సొంత బ్రాండ్లను షాపుల్లో విక్రయించారు. ఇది మద్యం తాగేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా గత ప్రభుత్వం జే బ్రాండ్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడంతో తాగేవారిలో కొందరు నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ వైపు మళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అన్ని పాపులర్‌ బ్రాండ్లూ రావడంతో చాలావరకు ఎన్‌డీపీఎల్‌ ఆగిపోయింది. మరోవైపు నాటుసారా వినియోగం కూడా తగ్గుతోంది. ఈ పరిణామాలతో షాపుల్లో మద్యం వినియోగం పెరుగుతోంది.

తిరిగి రైల్వే శాఖకు వాసుదేవరెడ్డి

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని రాష్ట్రప్రభుత్వం తన మాతృశాఖయిన రైల్వే శాఖకు తిప్పిపంపింది. ఆయన్ను తక్షణమే రిలీవ్‌ చేస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌ సీఎంగా గద్దెనెక్కాక 2019లో ఆగస్టులో వాసుదేవరెడ్డి రైల్వే శాఖ నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. గత ఏడాది ఆగస్టులో ఆయన డిప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసింది. కానీ ఆయనపై మద్యం అక్రమాల ఆరోపణలు రావడంతో రాష్ట్రప్రభుత్వం రిలీవ్‌ చేయలేదు. దాని విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఆయన డిప్యుటేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడంతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ను తిరిగి మాతృశాఖకు పంపింది.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:58 AM