Share News

Gachibowli Land: సుప్రీం మమ్మల్ని అడ్డుకోలేదుగా!?

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:01 AM

కొత్తగా దాఖలైన పిటిషన్లలో సైతం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, అప్పటిలోగా మధ్యంతర దరఖాస్తులతో సహా అన్ని పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

Gachibowli Land: సుప్రీం మమ్మల్ని అడ్డుకోలేదుగా!?

  • కొత్తగా దాఖలైన పిటిషన్లలోనూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

  • విచారణ ఈనెల ఏడోతేదీకి వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిందని, అత్యున్నత న్యాయస్థానం జోక్యం నేపథ్యంలో హైకోర్టు ఎదుట ఉన్న కేసుల్లో కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని, విచారణను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి కోరారు. దాంతో, ‘సుప్రీం కోర్టు మమ్మల్ని అడ్డుకోలేదు కదా!?’’ అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయినా, తమ స్పందనను సమర్పించే వరకూ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేయడంతో తమ ఎదుట ఉన్న పిటిషన్లను ఈనెల ఏడో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కొత్తగా దాఖలైన పిటిషన్లలో సైతం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, అప్పటిలోగా మధ్యంతర దరఖాస్తులతో సహా అన్ని పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలిలో అడవిని తొలగించరాదని, సదరు భూ బదిలీ జీవో 54ను కొట్టేసి.. ఆ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా గుర్తించాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దాంతో, గురువారం సాయంత్రం వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది కూడా.


ఈ నేపథ్యంలోనే, ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి హాజరయ్యారు. సింఘ్వి వాదనలు ప్రారంభిస్తూ.. సదరు భూమిని అటవీ భూమిగా ఎక్కడా పేర్కొనలేదని, గత 30 ఏళ్ల రికార్డు తమ వద్ద ఉందని తెలిపారు. కాగా, 400 ఎకరాల్లో చెట్ల నరికివేతను, భూమి చదును చేసే పనులను ఆపాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. ప్రభుత్వం అలాగే పనులు కొనసాగించిందని వట ఫౌండేషన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రభుత్వ తీరుపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ వాదిస్తూ.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర అటవీ శాఖ వివరణను కేంద్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. కాగా ఇదే వ్యవహారంపై పలువురు హెచ్‌సీయూ విద్యార్థులు లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. చెట్లను పడగొట్టకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినందున.. తమ ఎదుట ఉన్న పిటిషన్లను ఈనెల ఏడో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:01 AM