Ugadi: 3.15 కోట్ల మందికి సన్నబియ్యం
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:39 AM
ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 15 లక్షల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.

రేపు హుజూర్‌నగర్‌లో ప్రారంభం
కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు
సన్నబియ్యంతో పాటు కొత్త కార్డులిస్తాం
కార్డులపై ప్రధాని బొమ్మ వేయాలన్న
ప్రతిపాదన రాలేదు.. వస్తే పరిశీలిస్తాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్/హుజూర్‌నగర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 15 లక్షల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 80-84 శాతం మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో ఇదో విప్లవాత్మక సంక్షేమ పథకమని, ఇంతకంటే అద్భుతమైన పథకం ఏదీ లేదని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులున్నాయని.. కొత్త మరో 10 లక్షలు కార్డులు పెరుగుతాయని, మొత్తం కోటి కార్డులు అవుతాయని చెప్పారు. లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 2.85 కోట్లు ఉండగా.. మరో 30 లక్షల మంది పెరుగుతారని, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.15 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నెలవారీ కోటా పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇతర నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఏయే వస్తువులు ఇవ్వాలి? ఎంత పరిమాణంలో ఇవ్వాలనే దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద బియ్యం పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.5,489 కోట్లు వెచ్చిస్తోందని, రాష్ట్రం రూ.8,033 కోట్లు కలిపి ఏడాదికి రూ.13,522 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉత్తమ్ వివరించారు.
ఇష్టం వచ్చిన చోట బియ్యం తీసుకోవచ్చు
రాష్ట్రంలో రేషన్‌కార్డులు ఎక్కడ ఉన్నా.. లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన చోట బియ్యం తీసుకోవచ్చన్నారు. సన్నధాన్యం సాగును ప్రోత్సహించామని, రూ.2,300 ఎమ్మెస్పీ ఉంటే.. క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి.. రూ.2,800 చొప్పున సన్నాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 4.41 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల బోనస్ చెల్లించామన్నారు. రాష్ట్రంలో వానాకాలం, యాసంగిలో కలిపి సన్నధాన్యం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుందని చెప్పారు. సన్నబియ్యంతోపాటు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డులు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు (ఏపీఎల్) ఆకుపచ్చ రంగు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయన్నారు. కార్డుల ముద్రణ ప్రారంభం అవుతోందని, ఏప్రిల్‌లో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఏప్రిల్ కోటా బియ్యం పంపిణీ చేసేనాటికి కొత్త కార్డులు చేతికి అందకపోయినా.. లబ్ధిదారుల జాబితాలో ఉన్న పేర్ల ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద కేటాయిస్తున్న బడ్జెట్‌లో సన్నబియ్యం పథకానికిగాను అదనపు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్, తాను కలిసి విజ్ఞప్తి చేయగా.. సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిపారు. రేషన్ కార్డులపై ప్రధానమంత్రి బొమ్మ వేయాలనే ప్రతిపాదన రాలేదని, వస్తే పరిశీలిస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం ఆయన హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సుమారు 50వేల మందితో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News