Share News

Bill Payments: 20 లోపు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:30 AM

రెండు సంవత్సరాల నుంచి బిల్లుల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ సివిల్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆరోపించింది.

Bill Payments: 20 లోపు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

  • లేకపోతే 25న అసెంబ్లీ ముట్టడిస్తాం

  • తెలంగాణ సివిల్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హెచ్చరిక

  • బిల్లులు చెల్లించాలని భట్టి చాంబర్‌ ముందు నిరసన

పంజాగుట్ట, హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రెండు సంవత్సరాల నుంచి బిల్లుల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ సివిల్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ఈమేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్‌ అధ్యక్షుడు శంకరయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందని వడ్డీకి అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారని, రూ.10 లక్షల మేర పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు 6 వేల మంది ఉన్నారని, వారికి రూ.505 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉన్నాయన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి ఎదుర్కొన్నామన్నారు. ఈనెల 20వ తేదీలోపు రూ.10 లక్షల లోపు ఉన్న చిన్న కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించాలని, లేకపోతే ఈనెల 25న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కొంత మంది అధికారులు పర్సంటేజీలు అడుగుతున్నారని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆపొద్దని, ఇవ్వమని చెప్పారని, కానీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాత్రం ఆయనకు నచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారన్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని తొలగించి తమకు న్యాయం చేయాలన్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే గతి అన్నారు.


బిల్లులు చెల్లించాలని నిరసన:

అనంతరం తమ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటూ తెలంగాణ సివిల్‌ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం చాంబర్‌ వద్ద వచ్చిన భట్టికి బిల్లులు చెల్లించాలని వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా ఽసెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దాంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం మళ్లీ చాంబర్‌ వద్దకు వచ్చిన భట్టిని కలిసి వినతిపత్రం అందించారు.

Updated Date - Mar 08 , 2025 | 04:30 AM