Weather: పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన!
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:18 AM
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయు. పొద్దంతా భరించలేని ఎండలు కొడుతుంటే.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి.

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
నేడు, రేపు వానలు.. ఎండల తీవ్రతపైనా అధికారుల హెచ్చరికలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయు. పొద్దంతా భరించలేని ఎండలు కొడుతుంటే.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. ఏదేమైనా జనానికి ఉక్కపోత బాధ తప్పట్లేదు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం దాదాపు అన్ని జిల్లాల్లోనూ 40-44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో పడిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా.. పలు పంటలకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లా గోదూర్‌లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 43.1, అదే జిల్లా వెల్గనూర్‌లో 43, సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌లో 42.9, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 42.3 డిగ్రీలుగా రికార్డయింది. ఇటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో వడగండ్ల వాన, ఈదురుగాలులతో పొలాల్లో ధాన్యం నెలరాలింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఈదురుగాలులకు పొలాల్లో వడ్లు, తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు మండలాల్లో 1-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అయితే ఎండల తీవ్రత కూడా పెరుగుతుందని పలు జిల్లాల పరిధిలో సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.