భట్టిని కలిసిన ఉద్యోగుల జేఏసీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:04 AM
ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి జరగలేదని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భట్టి విక్రమార్కకు తెలిపారు.

57 పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినతి
12న సమావేశం అవుతామని డిప్యుటీ సీఎం హామీ
హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి జరగలేదని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భట్టి విక్రమార్కకు తెలిపారు. సోమవారం ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగులు 57 పెండింగ్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. 2023 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతో పాటు 2022 నుంచి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయడం, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించేలా పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే తక్షణమే 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్‌సీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు, వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు తదితర డిమాండ్లను ప్రస్తావించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం 12 గంటలకు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమవుతుందని భట్టి హామీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదరి ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు.