15వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:48 AM
తెలంగాణ నూతన పర్యాటక విధానంపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌ల వద్ద భారీ మాల్స్‌ను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

నూతన పర్యాటక విధానంపై జీవో
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నూతన పర్యాటక విధానంపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌ల వద్ద భారీ మాల్స్‌ను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే బీఓటి (బిల్డ్ అండ్ ఆపరేట్,ట్రాన్స్‌ఫర్) పద్దతిలో అభివృద్ధి చేసే టూరిజం ప్రాజెక్టులకు కేటాయించే స్థలాల రిజిస్ట్రేషన్ చార్జీల్లో 5 శాతం లీజుకు ఖరారు చేశారు. యేటా 5శాతం లీజు మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రధానంగా మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్ల పాటు, పెద్ద, మధ్య తరహా ప్రాజెక్టులకు 33ఏళ్ల పాటు, చిన్న, సూక్ష్మతరహా ప్రాజెక్టులకు స్థలాలను 15 ఏళ్ల వరకు లీజు పరిమితిని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది. ప్రధానంగా ప్రకృతి, వైద్యం, అధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్ట్ సర్య్కూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిని పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. టూరిజం ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకువచ్చే కంపెనీలకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలను అందించనుంది.
సర్కారు లక్ష్యాలివే
నూతన పర్యాటక విధానంతో రాబోయే ఐదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో సుమారు 3 లక్షల అదనపు ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం, ఆయా ప్రాంతాల్లోనూ వివిధ రకాల పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు.