Share News

Summer Recipe: కేరళ స్టైల్లో పనస తొనల హల్వా.. ఎప్పుడైనా తిన్నారా.. సమ్మర్‌లో చాలా మంచిది..

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:56 PM

Kerala Style Jack Fruit Halwa Recipe: వేసవిలో ద్రవ పదార్థాలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆకలి తగ్గి సరిపడినంత ఆహారం తినలేకపోతారు. ఇలా జరగకూడదంటే కేరళ స్టైల్ జాక్ ఫ్రూట్ హల్వా ఓసారి తిని చూడండి. తిన్నాక శక్తి వస్తుంది. ఆకలి పెరుగుతుంది. మరి, దీని రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే..

Summer Recipe: కేరళ స్టైల్లో పనస తొనల హల్వా.. ఎప్పుడైనా తిన్నారా.. సమ్మర్‌లో చాలా మంచిది..
Delicious Jack Fruit Halwa Recipe

Delicious JackFruit Halwa For Summer: ఎండకాలంలో వేడి వాతావరణం కారణంగా ఎక్కువగా నీళ్లు లేదా చల్లని పదార్థాలే తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆకలి మందగించి తగినంత పోషకాహారం తీసుకోలేరు. తద్వారా త్వరగా శక్తి కోల్పోయి అలసట, నీరసం ఆవరిస్తుంది. అదే ఈ పదార్థం తిన్నారనుకోండి. ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఆకలి కూడా బాగా వేస్తుంది. మరి, ఆ ఆహారపదార్థం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అదే పనస తొనల హల్వా. కేరళలో బెస్ట్ సమ్మర్ రెసిపీగా పేరొందిన ఈ తియ్యటి నోరూరించే హల్వాని ఇంట్లోనే ఎంచక్కా ఇలా తయారుచేసుకోండి. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం.


పనస తొనల హల్వా తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పనస తొనలు- ఒక కప్పు,

  • బెల్లం- పావు కప్పు,

  • నెయ్యి- రెండు చెంచాలు,

  • పచ్చి కోవా- రెండు చెంచాలు,

  • యాలకుల పొడి- చిటికెడు,

  • బాదం- ఎనిమిది,

  • జీడిపప్పు- పది,

  • పిస్తా- పన్నెండు


తయారీ విధానం :

  • ముందుగా గింజలు తీసేసిన పనస తొనలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో అర కప్పు నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించాలి. తరువాత బెల్లం నీళ్లను ఒక గిన్నెలోకి వడబోయాలి.

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో బాదం, జీడిపప్పు, పిస్తా వేసి దోరగా వేపి ఒక పళ్లెంలోకి తీసుకోవాలి. తరువాత పాన్‌లో పనస తొనల పేస్టు వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేవరకూ వేగనివ్వాలి. తరువాత బెల్లం నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం పాన్‌ నుంచి విడిపోతున్నప్పుడు పచ్చికోవా, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత వేయించిన బాదం, జీడిపప్పు, పిస్తా వేసి కలిపి స్టవ్ నుంచి కిందకి దించేయాలి. ఈ హల్వాని వేడిగా లేదంటే చల్లగా కూడా సర్వ్‌ చేసుకోవచ్చు.


జాగ్రత్తలు:

  • ఈ హల్వాని చిన్న మంట మీదనే తయారు చేసుకోవాలి.

  • పనస తొనలు తియ్యగానే ఉంటాయి కాబట్టి అంతగా తీపి తినని వాళ్లు ఒక చెంచా బెల్లం తగ్గించి వేసుకోవచ్చు.

  • ఒక చెంచా కార్న్‌ఫ్లోర్‌ని పావు కప్పు నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని పచ్చికోవాకు బదులు వేసుకోవచ్చు.


Read Also: Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున చేసుకోవాల్సిన స్పెషల్ ప్రసాదాలు.. రెసిపీలు..

Magic Masala Recipe : నిమిషాల్లో తయారయ్యే మ్యాజిక్ మసాలా.. ఏ రెసిపీ అయినా టేస్ట్

మీకు రాజపాయసం గురించి తెలుసా.. దాన్ని ఎలా తయారు చేస్తారంటే..

Updated Date - Apr 05 , 2025 | 01:03 PM