రాకెట్ వేగంతో కరోనా!?
ABN , First Publish Date - 2020-09-09T08:59:22+05:30 IST
ఈ ఏడాది మిగిలిన మూడు మాసాల్లో మూడు రాకెట్లను ప్రయోగించాలన్న ఇస్రో లక్ష్యానికి కరోనా కళ్లెం వేసింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో వైరస్ రాకెట్ వేగంతో విస్తరిస్తూ అంతరిక్ష

షార్‌ను వణికిస్తున్న వైరస్
ఇప్పటికే 153 మందికి పాజిటివ్?
3 ప్రయోగాల లక్ష్యానికి కళ్లెం
ఇప్పటికే మూతపడిన ఎస్‌బీఐ, ఆసుపత్రి
కొవిడ్ ఆసుపత్రిగా నక్షత్ర అతిథిగృహం
పాజిటివ్‌లు పెరిగిపోతుండటంతో హోం క్వారంటైన్లకే ప్రాధాన్యం
ఆందోళనలో ఉద్యోగులు, భద్రతా సిబ్బంది
సూళ్లూరుపేట, సెప్టెంబరు 8 : ఈ ఏడాది మిగిలిన మూడు మాసాల్లో మూడు రాకెట్లను ప్రయోగించాలన్న ఇస్రో లక్ష్యానికి కరోనా కళ్లెం వేసింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో వైరస్ రాకెట్ వేగంతో విస్తరిస్తూ అంతరిక్ష కార్యకలపాలకు అడ్డుపడుతోంది. షార్‌ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న సీఐఎ్‌సఎఫ్ భద్రతా సిబ్బంది సైతం కరోనాతో విలవిల్లాడే గడ్డు పరిస్థితి ఏర్పడింది. షార్‌లో 1950 మంది ఇస్రో ఉద్యోగులు, 800 మంది సీఐఎ్‌సఎ్‌సఎఫ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా శ్రీహరికోట ఫేజ్-1, ఫేజ్-2, క్యూసీహెచ్ కాలనీలతోపాటు సూళ్లూరుపేటలోని డీవోఎస్, డీఆర్‌డీఎల్, ఏఆర్పీ కాలనీలలో నివసిస్తున్నారు.
ప్రస్తుతం అటు శ్రీహరికోట ఇటు సూళ్లూరుపేటలోని షార్ కాలనీలలో కరోనా విజృంభిస్తోంది. మే వరకు షార్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జూన్ నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతూ షార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా ఊహించని రీతిలో కేసులు పెరిగిపోయాయి. గత శనివారం 110 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 33 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఆదివారం 31 మంది సీఐఎ్‌సఎఫ్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 30 మంది కరోనా బారిన పడినట్టు తేలడంతో షార్‌ను ఉలిక్కి పడేలా చేసింది. దీంతో సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది మొత్తానికి నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. షార్‌లో అధికారిక లెక్కల మేరకు ఇప్పటికి 153 మంది కరోనా బారిన పడినట్లు నమోదై ఉంది.
మూతపడిన ఎస్‌బీఐ, ఆసుపత్రి
గత నెలలో షార్‌లోని ఎస్‌బీఐ సిబ్బంది కరోనా బారిన పడటంతో రెండు రోజులు బ్యాంకును మూసివేశారు. అలాగే సూళ్లూరుపేటలోని షార్‌కు చెందిన సతీష్ ధవన్ మెమోరియల్ ఆసుపత్రిలో ఓ వైద్యుడితోపాటు మరో నలుగురు కరోనా బారిన పడటంతో ఆసుపత్రిని మూసివేసి గత వారంలో పునంప్రారంభించారు. అయితే, ఓ వ్యక్తిగా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిని మూసివేసి రసాయనాలతో శుభ్రపరస్తున్నారు.
ఇప్పటికి రెండుసార్లు లాక్‌డౌన్
కరోనా కేసుల విజృంభణలో జూలైలో ఒకసారి, ఆగస్టులో మరోసారి షార్‌లో లాక్‌డౌన్ విధించారు. గత సోమవారం నుంచి 50 శాతం ఉద్యోగులతో పనులు ప్రారంభించారు. అయితే ఐదు రోజులు గడిచాయో లేదో శనివారం 33 మంది, ఆదివారం 30 మంది కరోనా బారిన పడటం షార్‌లో కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలు దొరకకపోవడంతో షార్ అధికారులు శ్రీహరికోటలోని నక్షత్ర గెస్ట్‌హౌ్‌సను కోవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే, కేసులు పెరిగి పోతుండటంతో ప్రస్తుతం హౌస్ క్వారంటైన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొసమెరుపు
షార్‌ను కరోనా అతలాకుతం చేస్తుంటే ఇస్రో మూడు మాసాల్లో మూడు రాకెట్లను ప్రయోగించాలని సంకల్పించింది. డిసెంబరులోగా రెండు సీఎ్‌సఎల్వీలతోపాటు తొలిసారిగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎ్‌సఎల్వీ)లను ప్రయోగించాలని నిర్ధేశించింది. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఈ రాకెట్లను అనుసధానం చేసి ప్రయోగించేందుకు సిద్ధం చేయడం సాధ్యమా!? అని షార్ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.
కొత్త కేసులు 1042
ఆరుగురు బాధితుల మృతి
నెల్లూరు (వైద్యం) : జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గనంటున్నాయి. ప్రతి రోజు వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం 1042 కరోనా కేసులు రికార్డుకెక్కాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,435కు చేరుకున్నాయి. ఇక కరోనా నుంచి కోలుకోలేక ఆరుగురు మృతి చెందారు. నెల్లూరులో నలుగుర, బోగోలు మండలం బిట్రగుంటలో ఒకరు, కలిగిరి మండలం సిద్దనకొండూరులో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే కరోనాతో కోలుకున్న 1184 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్ చేశారు.