CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:31 PM
CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.

కృష్ణా: దేశం, సమాజం, రాష్ట్రం కోసం తపన పడే వ్యక్తి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ(ఆదివారం) ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. గరికపాటి నరసింహారావు ఉగాది ప్రవచనాలు ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, స్వర్ణభారతి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ప్రజలు ఆ పనులు మరిచిపోతున్నారు...
ఉగాది రోజు ఈట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉగాది అనేది మన తెలుగువాళ్లకు పెద్ద పండుగ.. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయని అన్నారు. మన బాధ్యతగా ప్రజలు చేయాల్సింది చేస్తే.. ప్రభుత్వం కూడా బాధ్యతతో చేస్తుందని గరికపాటి మంచి మాటలు చెప్పారని తెలిపారు. ప్రజలు చేయాల్సిన పనులు మరిచిపోతున్నారని.. మాకేమిస్తారో చెప్పండి అంటున్నారని అన్నారు. పండుగలు అనేది మన బారతీయ సంస్కతి, సంప్రదాయాలకు నిదర్శనమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
సమాజం కోసం నిరంతరం పని చేయాలి..
‘జీవితంలో అన్ని రకాల సమస్యలు ఉంటాయనేది చెప్పేందుకు ఉగాది పండుగే పెద్ద ఉదాహరణ. వేరే దేశంలో ఉన్న వారు కూడా మన సంస్కృతిని అవలంబిస్తున్నారు.. ఇదే మన దేశానికి ఉన్న సంపద, నేను, వెంకయ్యనాయుడు ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందాం, అసెంబ్లీలో వెంకయ్యనాయుడు మైక్ తీసుకున్నారంటే.. గజగజలాడించేవారు. ఎలాంటి సమస్య ఉన్నా... అనర్గళంగా ఆయన చెప్పేవారు. ఇద్దరం వేరే వేరే పార్టీల్లో ఉన్నా... వెంకయ్యనాయుడు ఎప్పుడూ ప్రజాహితం గురించే ఆలోచన చేసేవారు. భారత ఉపరాష్ట్రపతిగా పని చేసి.. రాజకీయాలకు దూరంగా వెంకయ్యనాయుడు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒక ఆస్తిగా నేడు స్వర్ణభారతి ట్రస్ట్ తయారైంది. వెంకయ్యనాయుడు తన పిల్లల కోసం కంటే.. ప్రజల కోసం క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలో ఎవరికీ లేని కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం. విలువలు పడిపోతున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. ఒకప్పుడు వాజ్‌పాయ్, ఎన్టీఆర్, జ్యోతిబసు వంటి నేతలతో నేను పనిచేశాను. నేను ఇప్పుడు ఎవరితో పోటీ పడుతున్నానా అని చూస్తే.. డిజపాయింట్ అవుతున్నా. జీవితంలో సమాజం కోసం నిరంతరం పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నా. నా జీవితం చివరి వరకు ప్రజల కోసమే నేను పని చేస్తా. ఒక ట్రస్ట్ నడపడం అంటే అంత సులువు కాదు.. కానీ 24 ఏళ్లుగా స్వర్ణభారతి ట్రస్ట్‌ను నడుపుతున్న దీపా వెంకట్‌ను అభినందిస్తున్నా. ఒక మహిళగా ఉండి కూడా ఆదర్శవంతంగా ట్రస్ట్ నడపటం చాలా గొప్ప విషయం ’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అది చాలా గొప్ప విషయం..
‘గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కింద వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తామని యువత నేడు అంటున్నారు. అందుకు స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఏనాడు కూడా మా ట్రస్ట్‌కు ఈ పని చేసి పెట్టాలని వెంకయ్యనాయుడు ఎప్పుడూ నన్ను అడగలేదు. నెల్లూరు, ఆత్కూరులో వాళ్లు భూములు సొంతంగా కొని .. ట్రస్ట్‌ను నడుపుతున్నారు. వసతి, భోజనం పెట్టి మరీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ట్రస్టులో శిక్షణ పొందుతున్న పిల్లలను నేనే స్వయంగా టెస్ట్ కూడా చేశాను. వారు భవిష్యత్‌లో ఏం చేయాలో స్పష్టత ఇచ్చే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఉంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి.. అంతకుముందు సంపద సృష్టించడం చాలా తక్కువ. ఎన్టీఆర్ సీఎం అయ్యాక.. ప్రభుత్వం అంటే గవర్నరెన్స్‌తో పాటు సంక్షేమం, అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 1995లో నేను సీఎంగా ఉన్న సమయంలో.. కేంద్రంలో వెంకయ్యనాయుడు ఉన్నారు. మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి.. దేశం దశ దిశ నిర్దేశించారు. ఆ తర్వాత సంపద సృష్టించే పరిస్థితికి మనం ఎదిగాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2047 వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో భారత్ నెంబర్‌వన్ లేదా టూ లో ఉంటుంది. ఇతర దేశాల వారితో పోలిస్తే.. రెండింతల ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారు. జీరో పావర్టీ, పీ4, మార్గదర్శి, బంగారు కుటుంబం.. దీనికి నేడు శ్రీకారం చుడుతున్నాం. రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పాం. హైదరాబాద్‌లో రెండు లక్షలు అమ్మని ఎకరా భూమి.. నేడు వంద కోట్లుకు చేరింది.. ఇదే సంపద సృష్టించే విధానం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సంపద సృష్టించాలి..
‘సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. అది పది మందికి చేరడం కూడా అంతే ముఖ్యం. నా జీవిత ఆశయం.. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన.. దాని కోసం ఎంతవరకైనా వెళ్తా. మా చిన్ననాటి రోజుల్లో చదువుతో పాటు, ఆటలు, పాటలు, డ్యాన్స్ లు, డ్రాయింగ్ క్లాస్‌లు ఉండేవి. ఇప్పుడు అన్నీపోయాయి.. క్రియేటివిటీ లేదు.. సెల్ ఫోన్లకు విద్యార్థులు బానిసలు అవుతున్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే అని మన విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయానికి అభినందించాను. విలువలను ఏ విధంగా పెంచాలో... అది స్కూల్ స్థాయి నుంచే మొదలవ్వాలి. గరికపాటి వంటి వారు కూడా మీ ప్రవనచాల ద్వారా విలువల గురించి చెప్పాలి. పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురావాలనేది నా ఆకాంక్ష. విలువల గురించి వెంకయ్యనాయుడు ఎప్పుడూ తపన పడుతుంటారు. 2047 నాటికి నేను వేసే ఫౌండేషన్ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రస్థాయిలో ఉండాలనేది జరుగుతుంది. మన వారసత్వం విలువలతో కూడిన సమాజం.. అందరూ సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలి. సంపాదించిన డబ్బులో కొంత కుటుంబానికి, మరికొంత సమాజానికి ఖర్చు పెట్టండి. అప్పుడే మీ పేరు శాశ్వతంగా నిలుస్తుందని పారిశ్రామిక వేత్తలను నేను కోరుతున్నాను. హైదరాబాద్‌లో 25 ఏళ్ల కింద వేసిన ఫౌండేషన్ కారణంగా నేడు అత్యధిక ఆదాయం తెచ్చే నగరంగా మారింది. అమరావతి కూడా ఇదే విధంగా ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దుతాం. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఎప్పుడూ మంచిని ఆలోచించే వ్యక్తి.. అందుకే ఆయన ఎప్పుడు ఆహ్వానించినా కాదనకుండా వస్తాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News