తిరుమల వెంకన్న వద్దా రాజకీయాలా?
ABN , First Publish Date - 2021-07-11T08:34:08+05:30 IST
‘తిరుమల వెంకటేశ్వరస్వామి అందరి ఆరాధ్య దైవం. కానీ కృష్ణా జలాల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల అధికారులు

తెలంగాణ సిఫార్సు లేఖల తిరస్కారం దుర్మార్గం..
రాజకీయ ప్రయోజనాల కోసమే జల రగడ
షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక బీజేపీ డైరెక్షన్
అన్నా చెల్లీ కలిసే ఉంటున్నారు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల వెంకటేశ్వరస్వామి అందరి ఆరాధ్య దైవం. కానీ కృష్ణా జలాల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఆదేశాలు ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు. ఇది దుర్మార్గం. కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు దేవుని దగ్గరా రాజకీయాలు ప్రారంభించాయి. తెలంగాణ భక్తులు తిరుమలకు రావద్దా? ఇలాంటి వివాదాలు పెరిగితే రానున్న రోజుల్లో పెను తుపానుగా మారే ప్రమాదమూ ఉంది. ఇవి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు సీఎంలపైనా ఉంది’’ అంటూ టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ జల వివాదాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు అవకాశం ఉందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృభించి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి నుంచి దృష్టిని మళ్లించేందుకే కృష్ణా జలాల అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులూ తెరపైకి తెచ్చి జగడం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పంచాయితీని తిరుమల కొండపైకీ తెచ్చారన్నారు. అన్న జగనేమో కొండపైన పంచాయితీ పెడితే చెల్లి షర్మిల తెలంగాణలో కుంపటి పెట్టారన్నారు. మనశ్శాంతి కోసం తిరుమల కొండకు పోతే అక్కడా ఈ రగడ ఏంటని ప్రశ్నించారు. మంత్రులూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారన్నారు. ఇద్దరు సీఎంలూ ఫోన్లలో మాట్లాడుకుని ఈ వివాదానికి అంతం పలకాలని కోరారు. షర్మిల తెలంగాణ కోడలైనా ఆమెది రాయలసీమ రక్తమే కదా అన్నారు.
‘‘ఇది ఇద్దరు కుర్చీల పంచాయితీ. అన్న కుర్చీ ఎక్కేటప్పుడు వాళ్ల తల్లి అక్కడికి పోయింది. చెల్లెలు ఖాళీగా ఉంది కాబట్టి తెలంగాణ కుర్చీ ఎక్కించేందుకు ఇక్కడకు వచ్చింది. సరికొత్త కుర్చీల పంచాయితీ’’ అంటూ వ్యాఖ్యానించారు. అమ్మ, అన్నా, చెల్లెలు అంతా ఒకటే ఇల్లు.. లోటస్ పాండ్‌లోనే ఉంటారని, ఇంకా పంపకాలు కూడా కాలేదని అన్నారు. షర్మిల పార్టీ వెనుక బీజేపీ డైరెక్షన్ ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ బీజేపీని విమర్శించలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రధాని మోదీని నిలదీయలేదన్నారు.