Riyadh: రియాద్‌లో సాటా సెంట్రల్ ఇప్తార్ విందు
ABN , Publish Date - Mar 22 , 2025 | 07:05 PM
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా సెంట్రల్’ ఆధ్వర్యంలో రియాధ్ నగరంలో ఇఫ్తార్ విందు జరిగింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమిలో క్రమేణా మత విద్వేష పూరిత వాతావరణం పెరుగుతూ సామరస్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రవాసంలో తెలుగు ప్రవాసీయులు మాత్రం మతసామరస్యం, మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ ఇష్టపూర్వకంగా ఒక మతస్థులు మరొకర్ని విందుకు ఆహ్వానించి వడ్డించే వారే నిజంగా విశాల హృదయులు. తెలుగు ప్రవాసీయులు ప్రతి రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ కార్యక్రమాలు ఆప్యాయత వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడడానికి దోహదపడుతున్నాయి.
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా సెంట్రల్’ రియాధ్ నగరంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలు అందరికి ఒక దిక్సూచిగా ఉంటున్నాయి. ఇప్తార్ విందు సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చాకెట్లు తింటే దంతాలకు జరిగే నష్టం గురించి చిన్నారులకు హితబోధన నుండి మొదలు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్న మూతపడ్డ పరిశ్రమలోని కార్మికులను ఆహార సామాగ్రి అందించడం వరకూ సాటా సెంట్రల్ వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టింది. అన్ని కార్యక్రమాలలో మహిళలు అగ్రభాగాన నిలిచారు.
Also Read: తానా మహాసభలు.. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఆహ్వానం
మైరా ఖురాన్ పఠనంతో మొదలయిన కార్యక్రమంలో తెలుగులో దాని అనువాదాన్ని జాకీరా వివరించారు. ప్రస్తుత కాలంలో అందునా ప్రవాసంలో తల్లి పాత్ర గురించి ఖదీజా, రేష్మాలు వివరించిన తీరు మహిళలు, చిన్నారులలో ఆసక్తి రేక్కించింది. దంత ఆరోగ్య ఆవశ్యకత గురించి డాక్టర్ షాహీనా వివరించగా రంజాన్ మాసం ప్రాముఖ్యత గురించి జవేరియా నిషాత్ చక్కగా వివరించారు. సాధారణంగా చేసే అరబ్బి భాషలో దువా కాకుండా తెలుగులో షాహీన్ చేసిన దువా పట్ల అందరు ఆసక్తి ప్రదర్శించారు.
జువేరియా, షబ్నం, షహానాలు కలిసి రంజాన్ దుప్పట్టా స్టాల్‌ను ఏర్పాటు చేసి అందరికి ఉచితంగా పంపిణీ చేయగా అదే విధంగా మహిళలు అమిత ఆసక్తి ప్రదర్శించే మహెందీ స్టాల్‌ను ఇర్ఫానా, జూహీ, సాలెహలు ఏర్పాటు చేసి అందరికీ ఆకర్షనీయ డిజైన్లు అందించారు. డాక్టర్ ఫారియా యూసుఫ్ దంత ఆరోగ్య స్టాల్‌ను ఏర్పాటు చేయగా జీనత్, షబ్నం, షబ్రీన్‌లు రూపొందించిన ఫ్రెండ్ షిప్ కార్డు స్టాల్ కూడా అందర్నీ ఆకట్టుకోంది. భారతీయ జాతీయ స్ఫూర్తిను ప్రతిబింబించే గేయాలను చిన్నారులు పాడగా దీనికి సుమయ్య, శ్రీష్మలు దర్శకత్వం వహించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమ నిర్వహణలో విజయవాడకు చెందిన సాదిఖ్ దంపతులు కీలక పాత్ర వహించారు.
Also Read: తానా మహాసభలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
రియాధ్ నగర శివారులో ఒక పారిశ్రామిక సంస్థ మూతపడగా అందులో పని చేస్తున్న 350 మంది కార్మికులు స్వదేశాలకు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరికి పని లేకుండా, తినడానికి తిండి సైతం లేక అలమటిస్తుండగా వారికి రంజాన్ సందర్భంగా నెల రోజులకు సరిపడా భోజన సామగ్రి అందించినట్లుగా సాటా సెంట్రల్ అధ్యక్షుడు జి. ఆనందరాజు, సలహాదారుడు దుగ్గపు ఎర్రన్న, ఉపాధ్యక్షుడు ఆనంద్ పోకూరి మహిళ విభాగం అధ్యక్షురాలు కందుల సుచరితలు తెలిపారు. ఈ రకంగా భోజన సామగ్రి అందుకున్న పేద వారిలో హిందువులు, ముస్లింలు ఇద్దరు ఉన్నారు.
రంజాన్, సంక్రాంతి లేదా క్రిస్మస్ అనేది ఒక సందర్భం మాత్రమే కానీ అందరితో ఆప్యాయత పెంచుకోవడమే సాటా సెంట్రల్ లక్ష్యమని సాటా ప్రతినిధులు రంజీత్, ముజ్జమ్మీల్, జానీ బాషా, ఆనంద్ పోకూరి, పవన్, భవానీ శంకర్, శివారెడ్డి, శౌకత్, నాజీమోద్దీన్, యాఖూబ్, వంశీ, సత్తిబాబు మరియు గోవిందరాజులు పెర్కోన్నారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి