నగరంలో.. ముసురు వాన

ABN , First Publish Date - 2021-07-23T05:29:44+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో బుధవారం నుంచి ముసురు వాన మొదలైంది.

నగరంలో.. ముసురు వాన
బ్రాడీపేట 4/18లో కూలిన భారీ వృక్షం

వర్షంతో స్తంభించిన జనజీవనం

గుంటూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో బుధవారం నుంచి ముసురు వాన మొదలైంది. ఈ వర్షం గురువారం రోజంతా కురుస్తూనే ఉంది. వర్షానికి తోడు ఈదురుగాలి తోడు కావడంతో ప్రజలు చలితో గజగజ వణికిపోయారు. గత శనివారం కురిసిన భారీ వర్షానికి గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో  ముసరువానతో మళ్లీ వర్షం నీరు వచ్చి చేరడంతో శివారు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లపాడు రోడ్డులోని శ్రీలక్ష్మినగర్‌లోని రెండు వీధుల్లోకి డ్రెయినేజీ నీరు చేరింది. పీకలవాగు వంటి అవుట్‌ఫాల్‌ డ్రెయిన్లలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం కారణంగా నగరంలో గురువారం జనజీవనం స్తంభించిపోయింది. విరామం లేకుండా కురిసిన వర్షంతో చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లింది. అలానే భవన నిర్మాణ పనులకు ఆటంకం కలగడంతో బేల్దార్‌ కూలీలకు పని లేకుండా పోయింది. పండ్లు, కూరగాయలు మిగిలిపోవడంతో వాటిని పారబోయాల్సి వచ్చిందని వీధి వ్యాపారులు వాపోయారు. వర్షం వలన గొడుగులు, రెయిన్‌ కోట్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. రెయిన్‌ కోట్లు రూ.150 నుంచి రూ.వెయ్యి వరకు రకాన్ని బట్టి విక్రయిస్తోన్నారు. అలానే గొడుగులు కూడా రూ. 150 నుంచి రూ. 400 వరకు వివిధ సైజుల్లో అమ్ముతోన్నారు. శుక్రవారం కూడా ముసురు వాన కొనసాగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. గురువారం నగరంలోని బ్రాడీపేట, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంతాల్లో రెండు భారీ వృక్షాలు నేలవాలాయి. ప్రభుత్వమహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో వృక్షం కొమ్మలు ఓ విద్యార్థినిపై పడ్డాయి. దీంతో గాయపడగా వెస్ట్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.  

వర్షాలతో సమస్యలు తలెత్తకుండా చూడాలి

గుంటూరు(కార్పొరేషన్‌): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య అధికారులను కమిషనర్‌ అనూరాధ ఆదేశించారు. నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లను తవ్వించాలన్నారు. తాగు నీటి సరఫరాలో లీకులు ఏర్పడితే సదరు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. పీకల వాగు పరసర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయలన్నారు. ప్రతి శానిటరీ డివిజన్‌కి కొంతమంది వర్కర్లను అందుబాటులో ఉంచుకుని, కాలువల ఓవర్‌ ఫ్లో, చెత్త చెదారం అడ్డు పడి నిలిచిన ప్రాంతాల్లో వెంటనే శుభ్రం చేసేలా చూడాలని ఎస్‌ఎస్‌లను ఆదేశించారు. సమావేశంలో డీసీలు శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, టీ వెంకటకృష్ణయ్య, ఎస్‌ఈ శ్రీనివాస్‌, సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, డీసీపీ హిమబిందు, ఎంహెచ్‌వో వెంకటరమణ, బయాలజిస్ట్‌ ఓబులు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-07-23T05:29:44+05:30 IST