జనగామ జిల్లాలో డ్రైరన్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2021-01-09T04:30:54+05:30 IST

జనగామ జిల్లాలో డ్రైరన్‌ సక్సెస్‌

జనగామ జిల్లాలో డ్రైరన్‌ సక్సెస్‌
పాలకుర్తి పీహెచ్‌పీసీలో డ్రైరన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిఖిల

427 మంది వైద్య సిబ్బందికి డమ్మీ వ్యాక్సినేషన్‌

జనగామ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ కార్యక్రమం శుక్రవారం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రిలో డ్రై రన్‌ నిర్వహించారు. మొదటగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య సిబ్బందిపై డ్రై రన్‌ నిర్వహించారు. ఒక్కో కేంద్రానికి 25 మంది వైద్య సిబ్బందికి డమ్మీ వ్యాక్సినేషన్‌ చేసి, దాని అమలుపై అవగాహన కల్పించారు. జిల్లా ఆస్పత్రితో పాటు జనగామ అర్బన్‌, ఓబుల్‌కేశవాపూర్‌, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, రఘునాథపల్లి, కోమల్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌, ఇప్పగూడెం, తాటికొండ, మల్కాపూర్‌, జఫర్‌ఘడ్‌, కూనూరు, లింగాలఘనపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డ్రై రన్‌ నిర్వహించారు. మూడు దశలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్‌కు వచ్చిన వ్యక్తి వివరాలను మొదటగా కొవిన్‌ యాప్‌లో నమోదు చేస్తారు. తర్వాత ప్రత్యేక గదిలో వ్యాక్సిన్‌ వేస్తారు. అనంతరం అబ్జర్వేషన్‌ రూమ్‌లో అరగంట పాటు పరిశీలనలో ఉంచుతారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 450 మంది వైద్య సిబ్బందికి డ్రై రన్‌ నిర్వహించాల్సి ఉండగా 427 మంది హాజరయ్యారు. కలెక్టర్‌ నిఖిల పాలకుర్తి పీహెచ్‌సీలో డ్రై రన్‌ను పరిశీలించారు. ప్రజలకు వ్యాక్సినేషన్‌ సమయంలో ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎదురయ్యే లోపాలను అధిగమించడానికి,  సిబ్బందిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఈ డ్రై రన్‌ ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన డ్రై రన్‌ను కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్యాధికారి మహేందర్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వోలు కరుణశ్రీ, సుధీర్‌కుమార్‌ పర్యవేక్షించారు.


Updated Date - 2021-01-09T04:30:54+05:30 IST

News Hub