Kishan Reddy: బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:57 AM
ఉత్తరాది, దక్షిణాది అంటూ కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎ్‌సలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎ్‌సలవి విభజన రాజకీయాలు
డీ లిమిటేషన్‌పై కేంద్రం ఏదీ తేల్చకముందే కుట్రలు: కిషన్‌రెడ్డి
స్టాలిన్ నిర్వహించింది దొంగల ముఠా భేటీ: బండి సంజయ్
హైదరాబాద్/చిక్కడపల్లి/కరీంనగర్ రూరల్/న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది, దక్షిణాది అంటూ కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎ్‌సలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. డీ లిమిటేషన్ పేరుతో చెన్నైలో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవ్వడం చూస్తుంటే ‘ఆలు లేదు చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ‘అసలు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి విధివిధానాలు ఖరారు కాలేదు. నియమ నిబంధనలు రూపొందించనేలేదు. కేంద్రం ఏది తేల్చకముందే.. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం. పైకి డీ లిమిటేషన్‌పై భేటీ అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి అజెండా బీజేపీపై విషం కక్కడమే. కేంద్రం డీ లిమిటేషన్ చేపట్టదలిచితే దక్షిణాది రాష్ట్రాల పట్ల ఎలాంటి వివక్ష చూపదు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఇటు బీఆర్‌ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో బీజేపీ విస్తరిస్తుంటే, కాంగ్రెస్ కుంచించుకుపోతోంది. నేడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది. దిక్కుతోచని స్థితిలో.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ముందు పెట్టి ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. డీ లిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ కృత్రిమవాదాన్ని స్టాలిన్ సృష్టించారు. దీనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పక్షాలు తందానా అంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని మరోసారి నిరూపితమైంది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
దోచుకున్నది.. దాచుకోవడానికే భేటీ: సంజయ్
డీ లిమిటేషన్ పేరుతో చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించింది దొంగల ముఠా సమావేశమని.. అది దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాముల నుంచి బయటపడడానికేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా చామనపల్లిలో మాట్లాడుతూ.. డీ లిమిటేషన్ పేరుతో చెన్నైలో సమావేశమైన పార్టీల వారంతా లిక్కర్ దందాలో దొరికినోళ్లేనని.. స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందన్నారు. పదేళ్ల పాలనలో చేసిన అవినీతి స్కాముల నుంచి తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్ కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. ఇండియా కూటమిలో స్టాలిన్ భాగస్వామి కాబట్టే చెన్నై భేటీకి సీఎం రేవంత్ వెళ్లారని.. అంతేకానీ ఆయనకు ఆ భేటీపై ఏ ఆసక్తి లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ ఢిల్లీలో అన్నారు.