Share News

KTR: బీజేపీ మాటల్ని నమ్మలేం

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:47 AM

పునర్విభజనతో దక్షిణాదికి నష్టం జరగదని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీని నమ్మలేమని.. అసెంబ్లీ సీట్ల పెంపే దీనికి ఉదాహరణ అని కేటీఆర్‌ చెప్పారు.

KTR: బీజేపీ మాటల్ని నమ్మలేం

  • అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉన్నా అమలు చేయలేదు

  • రేవంత్‌ నిర్వహించే భేటీకి కేసీఆర్‌ను పిలుస్తారో లేదో తెలియదు: కేటీఆర్‌

  • కేసీఆర్‌ను ఆహ్వానించటంపై పార్టీలో చర్చించి చెబుతా: సీఎం రేవంత్‌రెడ్డి

చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పునర్విభజనతో దక్షిణాదికి నష్టం జరగదని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీని నమ్మలేమని.. అసెంబ్లీ సీట్ల పెంపే దీనికి ఉదాహరణ అని కేటీఆర్‌ చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం నిర్దేశించిన ప్రకారం తెలంగాణ, ఏపీ అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచుతామని బీజేపీ ప్రకటించిందని, కానీ, ఇప్పటికీ ఆ పని చేయలేదని, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రం అసెంబ్లీ సీట్లు పెంచుకున్నారని వివరించారు. బీజేపీ మాటలపై నమ్మకం లేనందునే పునర్విభజనతో జరిగే నష్టంపై అందరం కలిసి సమావేశమై చర్చించామని కేటీఆర్‌ వివరించారు. చెన్నై సమావేశం నేపథ్యంలో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందో లేదో, కేసీఆర్‌ను పిలుస్తారో లేదో తనకు తెలియదన్నారు. చెన్నై సమావేశంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పాల్గొనటంపై బీజేపీ నేతలు చేసిన విమర్శల మీద స్పందిస్తూ.. ‘ఒక ప్రాంతంపై జరుగుతున్న వివక్షను తెలియజేస్తే దోపిడీ, కుట్రలు అంటున్నారు. ఇందులో దోపిడీ, కుట్రలు ఎక్కడున్నాయి’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


పార్టీలో చర్చించి చెబుతా: రేవంత్‌

నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో తాము నిర్వహించే సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించటంపై పార్టీలో చర్చించి చెబుతానని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి సహకరించే దిశగా తమకు మద్దతిచ్చేవారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 23 , 2025 | 03:49 AM