పోడు భూములు పరిశీలిస్తాం
ABN , First Publish Date - 2021-07-31T05:39:43+05:30 IST
పోడు భూములు పరిశీలిస్తాం

- భూపాలపల్లి ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణఆదిత్య
- పలిమెల మండలంలో పర్యటన
పలిమెల (మహదేవపూర్ రూరల్), జూలై 30 : జిల్లాలో 2005వ సంవత్సరానికి ముందు సాగు చేసుకుంటున్న పోడుభూములను పరిశీలించి, త్వరలో తగు చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. భూపాలపల్లి జిల్లా పలిమెలలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జెండగేతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ముకునూరు, దమ్మూరు, సర్వాయిపేట గ్రామాల్లో పర్యటించి, గిరిజనుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. దమ్మూరులో త్రీఫేజ్ విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు కృష్ణఆదిత్య దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. గ్రామానికి త్రీ పేజ్ విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోను ఆదేశించారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలు చిన్నగా ఉండటంతో, వెంటనే పెద్దవి నాటించాలని భూపాలపల్లి డీఆర్డీవోను కలెక్టర్ ఫోన్ లో ఆదేశించారు. సర్వాయిపేటలో గుంతలుగా ఉన్నరోడ్డును పంచాయతీ నిధులతో మరమ్మతు చేయాలని ఎంపీడీవో ప్రకాష్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని యువత మమేకమైన ఇన్‌చార్జి కలెక్టర్ ఆన్‌లైన్ పాఠాలపై ఆరాతీశారు. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివితే ఉన్నతస్థాయికి ఎదగవచ్చని ఈ సందర్భంగా అన్నారు. ఎంపీపీ కురుసం బుచ్చక్క, జడ్పీటీసీ ప్రేమలత మండలంలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని కోరగా, పరిశీలిస్తామని అన్నారు. కాగా, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో నాగేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే మహదేవపూర్ మండలంలోని సూరారం, అంబట్‌పల్లి, బొమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టీఎ్‌సఎండీసీ ఎండీ దీప్తి జ్ఞాపకార్థం టీఎ్‌సఎండీపీ పీవో రవికుమార్ నోట్‌పుస్తకాలను వితరణ చేశారు. ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, టీఎ్‌సఎండీసీ సిబ్బంది, కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, దీప్తి కరోనాతో మృతి చెందగా ఆమె జ్ఞాపకార్థం కాళేశ్వరం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 49 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మణిమాల, విద్యార్థులు పాల్గొన్నారు.
సమ్మక్క బ్యారేజీని సందర్శించిన కలెక్టర్..
కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్దఉన్న సమ్మక్క బ్యారేజీని కలెక్టర్ కృష్ణఆదిత్య, అడిషనల్ కలెక్టర్ ఆదర్శసురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్ కే.జెండగేతో కలిసి సందర్సించారు. ఈ సందర్భంగా బ్యారేజి పరిసరాలను, పరిశీలించారు. బ్యారేజీలో ఉన్న నీటి స్టోరేజీ, ఎన్ని గేట్లుఎత్తి దిగువకు నీటిని వదు లు తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్‌లు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.