Hyderabad: యువ వికాసం తిరస్కరణ
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:03 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆదిలోనే సమస్యలు ఎదురవుతున్నాయి.

దరఖాస్తులు స్వీకరించని రాజీవ్ యువ వికాసం సైట్
ఆధార్ నమోదు చేయగానే ‘ఆల్రెడీ అప్లైడ్’ అంటూ మెసేజ్
గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్నవారికీ సమస్య
అధికారులు పాత వివరాలను తొలగించనందునే!
దరఖాస్తుదారుల్లో అయోమయం.. నేడు పూర్తి మార్గదర్శకాలు!
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆదిలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పథకం కింద లబ్ధి కోసం పలువురు చేసుకుంటున్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో 2017-18లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుని.. లబ్ధి పొందని వారికి ఈ సమస్య ఎదురవుతోంది. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి యూనిట్లు మంజూరై.. ఏర్పాటు చేసుకోగా, మరికొందరికి మంజూరైనా యువ వికాసం పథకానికి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆన్‌లైన్‌లో, మండల కార్యాలయాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక.. ఏప్రిల్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు ప్రక్రియ మొదలు పెడతారు. మే 30వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి జాబితాను కలెక్టర్లకు పంపితే.. జిల్లా కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఇన్‌చార్జి మంత్రికి పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రారంభించి 9వ తేదీ వరకు అందజేస్తారు. ఈ నేపథ్యంలో యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ పథకాన్ని వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించడంతో.. ఎమ్మెల్యేలు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఏయే యూనిట్‌కు ఎంత రుణం వస్తుంది, ప్రభుత్వ రాయితీ ఎంత.. వంటి విషయాలపై ఎమ్మెల్యేల పేరుతో ప్రచురించిన కరపత్రాలతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు.
ఒక్కో యూనిట్‌కు ఒక్కో రకంగా..
యువ వికాసం పథకంలో వివిధ రకాల స్వయం ఉపాధి యూనిట్లు ఉన్నాయి. వీటిలో రూ.50 వేల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ప్రభుత్వం నూరు శాతం రాయితీ ప్రకటించింది. వీరు తిరిగి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక రూ.50 వేలకు పైన విలువ చేసే యూనిట్లకు 60 నుంచి 80 శాతం వరకు రాయితీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో రాయితీ ఎంత? గరిష్ఠంగా ఎంత మొత్తం ఇస్తారు? వీటిలో లబ్ధిదారు వాటా ఎంత? అన్నదానిపై స్పష్టత ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వివరాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం మాత్రం ఉందని ఎస్సీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. పథకంపై సోమవార పూర్తి మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు చాలా కాలం నుంచి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించే ప్రక్రియను నిలిపేశాయి. దీంతో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి 6 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందిని ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.