Britain PM : ఆర్థిక సంక్షోభంలో బ్రిటన్... పాపీస్ అమ్ముతున్న పీఎం రిషి...

ABN , First Publish Date - 2022-11-04T11:19:26+05:30 IST

బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జనాభాలో దాదాపు సగం మంది ఆహార కొరతతో ఆకలి కేకలు పెడుతున్నారు.

Britain PM : ఆర్థిక సంక్షోభంలో బ్రిటన్... పాపీస్ అమ్ముతున్న పీఎం రిషి...
Rishi Sunak

లండన్ : బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జనాభాలో దాదాపు సగం మంది ఆహార కొరతతో ఆకలి కేకలు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం తారాజువ్వలా దూసుకెళ్తోంది. అష్టకష్టాలు అనుభవిస్తూ, రోజువారీ కార్యకలాపాల కోసం లండన్ ట్యూబ్ స్టేషన్‌కు వెళ్లిన ప్రయాణికులు గురువారం చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడకు వచ్చే, పోయేవారికి పాపీస్ అమ్ముతూ తమ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) కనిపించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కొందరు ఆయన వద్ద పాపీస్ కొని, సెల్ఫీలు తీసుకున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పించారు.

రిషి సునాక్ లండన్ సబ్‌వే స్టేషన్‌లో పాపీస్ విక్రయించారు. ఓ ట్రేలో పాపీస్‌ను పెట్టుకుని ఆయన చురుగ్గా నడుస్తూ ప్రయాణికులకు పాపీస్ విక్రయించారు. వెస్ట్‌మినిస్టర్ ట్యూబ్ స్టేషన్‌లో గురువారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ దృశ్యం కనిపించింది.

బ్రిటిష్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, రాయల్ బ్రిటిష్ లెజియన్స్ యాన్యువల్ లండన్ పాపీ డే అపీల్‌ కోసం నిధులను సేకరించేందుకు రిషి సునాక్ పాపీస్‌ను అమ్మారు. ఒక్కొక్క పాపీని 5 పౌండ్లకు విక్రయించారు. ఆయనతోపాటు బ్రిటిష్ సైన్యం, నావికా దళం, వాయుసేన సిబ్బంది, వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, పాపీస్‌ను విక్రయించారు. వీరంతా ఇంటింటికీ తిరుగుతూ పాపీస్‌ను విక్రయించారు.

లండన్ ట్యూబ్ స్టేషన్‌లో రిషి సునాక్‌తో చాలా మంది సెల్ఫీలు తీసుకుని, కాసేపు ముచ్చటించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఆ మధుర జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. లూయీస్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరిస్తూ, రిషి సునాక్ చాలా నిరాడంబరంగా ఉన్నారని, ఆయనతో మాట్లాడటం సంతోషం కలిగించిందని చప్పారు. అయితే కొందరు మాత్రం రిషిని విమర్శిస్తున్నారు. చేయడానికి ఇంతకన్నా ఏం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఫొటోలకు పోజులిచ్చే కార్యక్రమమని ఎగతాళి చేస్తున్నారు.

ప్రయాణికులు అత్యధికంగా ఉండే సమయంలో తమకు సమయాన్ని కేటాయించి, తమతోపాటు నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రిషి సునాక్‌కు రాయల్ బ్రిటిష్ లెజియన్ ధన్యవాదాలు తెలిపింది.

Updated Date - 2022-11-04T11:19:32+05:30 IST