26/11 attacks : ముంబై దాడులతో మన బలహీనతలు బయటపడ్డాయి : మాజీ కేబినెట్ సెక్రటరీ
ABN , First Publish Date - 2022-12-02T13:28:45+05:30 IST
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీగా పని చేసిన కేఎం చంద్రశేఖర్ ఆనాటి పరిస్థితులను

న్యూఢిల్లీ : మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీగా పని చేసిన కేఎం చంద్రశేఖర్ ఆనాటి పరిస్థితులను ఘాటుగా విమర్శించారు. 2008 నవంబరులో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడులపై స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎవరు ఏ పని చేయాలనేదానిపై అప్పటి ప్రభుత్వంలో స్పష్టత లేకపోయిందని చెప్పారు. ఈ దాడుల వల్ల మన ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడంలో బలహీనతలు బయటపడ్డాయని చెప్పారు. ఆయన రాసిన పుస్తకం ‘యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్’లో ఈ వివరాలను వెల్లడించారు.
జాతీయ భద్రతా సలహాదారు (NSA) పదవిని 1998లో సృష్టించారని, ఇది సరైన దిశలో తీసుకున్న నిర్ణయమేనని చంద్రశేఖర్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ పదవిని సృష్టించిన తర్వాత ఏర్పడిన పరిస్థితిని ఆయన తప్పుబట్టారు. అధికారాలను ఎన్ఎస్ఏ, కేబినెట్ సెక్రటరీల మధ్య పంపిణీ చేయడం వల్ల గందరగోళం ఏర్పడిందన్నారు. భద్రతకు సంబంధించిన అంశాల నిర్వహణలో పోషించవలసిన పాత్రలపై గందరగోళం ఏర్పడటానికి అవకాశం కలిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మన దేశంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో బలహీనతను 26/11 దాడులు బయటపెట్టాయని పేర్కొన్నారు.
హోం మంత్రిత్వ శాఖ, రక్షణ దళాల నిఘా విభాగం క్రింద పని చేసే వేర్వేరు సంస్థలు క్షేత్ర స్థాయి విషయాలను సాధారణంగా కేబినెట్ సెక్రటరీకి తెలియజేయవని చెప్పారు. కేవలం కొన్ని జ్యూసీ బిట్స్‌ను మాత్రమే హోం మంత్రిత్వ శాఖకు లేదా రక్షణ మంత్రిత్వ శాఖకు లేదా ఎన్ఎస్ఏకు తెలియజేస్తాయన్నారు. అదే సమయంలో సకాలంలో తగిన సమాచారం లేకుండా కేబినెట్ సెక్రటరీ సంక్షోభ పరిస్థితులను పరిష్కరించవలసి ఉంటుందన్నారు. ఆ సంక్షోభం ఉగ్రవాద దాడి, లేదా హైజాక్, లేదా రకరకాల ఉగ్రవాదం కావచ్చునని తెలిపారు. సమన్వయపరిచే యంత్రాంగం ఏదీ లేదని తెలిపారు.
ముంబైపై 2008 నవంబరులో దాడులు జరిగినపుడు నిజమైన సంక్షోభం ఏర్పడిందని, ఆ సమయంలో కేంద్ర స్థాయిలో ఎవరు ఏ పని చేయాలో స్పష్టత లేదని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, సంబంధిత రాష్ట్రం కోరినపుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. దీంతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే తాను ఆ సంక్షోభంలోకి దిగవలసి వచ్చిందన్నారు. నిఘా సమాచారం లేదని, ముంబైలో ఏం జరుగుతోందో రాత్రి వరకు తనకు తెలియలేదని చెప్పారు. ఆ సంక్షోభ తీవ్రత ఏమిటి? దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఎదుర్కొనగలదా? అనే అంశాలపై తనకు స్పష్టత లేదన్నారు.
చంద్రశేఖర్‌ను అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఎంపిక చేసి, కేబినెట్ సెక్రటరీ పదవిలో నియమించారు. 2007 నుంచి 2011 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ‘As good as my word’ను ఇటీవలే ఆవిష్కరించారు.