Heavy rain: రాజధానిలో పలుచోట్ల భారీ వర్షం
ABN , First Publish Date - 2022-12-13T11:42:12+05:30 IST
వాయుగుండం ప్రభావంతో గత వారం రోజులుగా రాజధాని వాసులను చలిపులి గజగజ వణికిస్తుండగా అడపాదడపా పడుతున్న వర్షం ఉక్కిరిబిక్కిరి

బెంగళూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో గత వారం రోజులుగా రాజధాని వాసులను చలిపులి గజగజ వణికిస్తుండగా అడపాదడపా పడుతున్న వర్షం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీగానే వర్షం(Rain) కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావం తగ్గినా నగర వాతావరణం మాత్రం ఇంకా సన్నటి జల్లులతో చలిమయంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత కాసేపు ఎండకాచినా కేవలం గంట అవధిలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కనిపించింది. కాగా మరో రెండు రోజుల పాటు వాతవరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం మీడియాకు చెప్పారు. వర్షం కారణంగా నగరంలో మెట్రో రైలు నిర్మాణ పనులు, పలు చోట్ల రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు.