ఆంగ్ల సంవత్సరాదికి భారీ భద్రతా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-12-30T07:59:18+05:30 IST

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నగరంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా

ఆంగ్ల సంవత్సరాదికి భారీ భద్రతా ఏర్పాట్లు

- నగరంలో 450 చోట్ల వాహన తనిఖీలు

- రాత్రి ఒంటిగంట వరకే వేడుకులకు అవకాశం

- హోటళ్ల యాజమాన్యాలకు పోలీసుల ఆదేశం

చెన్నై, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నగరంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా భారీయెత్తున భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతియేటా ఆంగ్ల సంవత్సరాదికి మెరీనాబీచ్‌(Marina Beach) రోడ్డులో పాదచారులను భయపెట్టేలా బైకుల రేసులు జరపటం, హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యంమత్తులో అశ్లీల నృత్యా లు జరపటం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ ఎఫ్‌బీ7 వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కఠినమైన నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇక నగర పోలీసులు న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా వేయనున్నారు. నగరంలోని ఫ్లైఓవర్ల వద్ద మఫ్టీలో పోలీసులు నిఘా వేయనున్నారు. రహదారుల్లో ఈ నెల 31 రాత్రి ఒంటి గంట తర్వాత నగరవాసులెవరూ సంచరించకూడదని హెచ్చరికలు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బైకులపై సంచరించేవారిపై కేసు నమోదు చేసి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరాది సందర్భం గా హోటళ్లు రెస్టారెంట్లలో పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జీవాల్‌(Shankar Jeewal), అడిషనల్‌ పోలీసు కమిషనర్లు టీఎన్‌ అన్బు (నార్త్‌), ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా (సౌత్‌) తదితరులు హోటళ్ల యజమానులు, రెస్టారెంట్ల నిర్వాహకులతో గురువారం భేటీ అయ్యారు. ఈసమావేశంలో ఈనెల 31 సాయంత్రం ఆరు నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే న్యూఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు అనుమతిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒంటిగంట తర్వాత మద్యం విందులకు తావులేదన్నారు. ఈ వేడుకలకు వచ్చే వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వేడుకలు జరిగే హాల్స్‌లో 80 శాతం స్థలం వరకే జనాన్ని అనుమతించాలని, పోలీసులు అనుమతించిన స్థలాల్లోనే మద్యం విక్రయాలు జరగాలని, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ చేరువగా ఎలాంటి వేదికలు ఏర్పాటు చేయకూడదని ఆదేశించారు. స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను 31 సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకూ మూసివేయాలన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాలను వాడకుండా జాగ్రత్త వహించాలన్నారు. వేడుకల్లో పాల్గొనే విదేశీయుల పాస్‌పోర్ట్‌, వీసా తనిఖీ చేయాలని, ఎట్టి పరిస్థితులలో టపాసులు పేల్చకూడదని, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలకు అనుమతించకూడదని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు పోలీసు అధికారులు ఆదేశించారు.

Updated Date - 2022-12-30T07:59:20+05:30 IST