Covid outbreak: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్ని బయటపడ్డాయంటే?
ABN , First Publish Date - 2022-12-24T11:48:50+05:30 IST
చైనా (China)ను వణికిస్తున్న కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడు ప్రపంచ దేశాలను
న్యూఢిల్లీ: చైనా (China)ను వణికిస్తున్న కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా భయపెడుతోంది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులతో చైనా అల్లకల్లోలంగా మారింది. చైనా ప్రభావం చుట్టుపక్కల దేశాలపైనా పడింది. జపాన్, దక్షిణ కొరియాతోపాటు అమెరికాలో మళ్లీ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమ్తతమైన భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దీంతో దేశంలో మళ్లీ కలవరం మొదలైంది.
మరోవైపు, తూర్పు ఆసియా దేశాలన్నీ చైనా భయంతో అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణకులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. భారత ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. కొవిడ్ సన్నద్ధతపై సమీక్షించారు.
వ్యాప్తి చెందుతున్న బీఎఫ్.7
ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 (BF.7) నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. అన్ని దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నాలుగు వెలుగుచూశాయి. అలాగే, గత 24 గంటల్లో 201 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, రికవరీ రేటు 98.8 శాతం ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఇప్పటి వరకు డోసుల వ్యాక్సిన్లు వేశారంటే?
దేశంలో ఇప్పటి వరకు 220.04 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేశారు. గత 24 గంటల్లోనే ఏకంగా 1,05,044 డోసులు వేశారు. ప్రస్తుతం దేశంలో 3,397 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఖజురహో విమానాశ్రయంలో నేటి నుంచి ప్రయాణికుల స్క్రీనింగ్ టెస్ట్ మొదలైంది. జిల్లా ఆసుపత్రిలో 12 బెడ్స్‌తో ఐసీయూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ప్రజలు గుమికూడవద్దని, ప్రజలు భౌతిక దూరం పాటించాలని ఛత్రపూర్ సీఎంహెవో డాక్టర్ లఖన్ తివారీ కోరారు. మాస్కులు ధరించడం మర్చిపోవద్దని కోరారు.