స్టాక్ మార్కెట్లో రూ.7 లక్షలు పోగొట్టుకొని దారుణానికి ఒడిగట్టాడు.. రాత్రి 2 గంటల సమయంలో..
ABN , First Publish Date - 2022-10-08T03:29:29+05:30 IST
స్టాక్ మార్కెట్‌పై (Stock market) అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం లేదా ట్రేడింగ్ (Treding) చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై (Stock market) అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం లేదా ట్రేడింగ్ (Treding) చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పెట్టుబడి నష్టపోతే తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతి పరిణామాలు ఎంతటి దారుణాలకైనా దారితీయవచ్చని నిరూపించే ఘటన ఒకటి ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఫతేనగర్ ఏరియాలో నివాసముంటున్న జస్దీప్ సింగ్ (34) అనే యువకుడు స్టాక్మార్కెట్లో ఏకంగా రూ.7 లక్షలు నష్టపోయాడు. ఆ తర్వాత డబ్బు కోసం ఏం చెయ్యాలో తెలియక తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బు కావాలంటూ నిత్యం ఘర్షణలకు పాల్పడేవాడు. ఇవ్వబోమంటూ తల్లిదండ్రులు తిరస్కరించడంతో దారుణానికి ఒడిగట్టాడు.
శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో తల్లిదండ్రులపై దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తండ్రి 65 ఏళ్ల స్వర్ణజీత్ సింగ్ చనిపోయాడు. తల్లి అజిందర్ కౌర్ (60) ప్రాణాలతో బయటపడ్డప్పటికీ తీవ్రగాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఘన్‌శ్యామ్ బన్సల్ వెల్లడించారు. దాడి సమాచారం అందాక ఇద్దరినీ సమీపంలోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించామని, స్వర్ణజీత్ సింగ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అజిందర్ కౌర్‌ను సర్ గంగారామ్ హాస్పిటల్‌కు తరలించామని వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాబట్టి నిందితుడి తండ్రి స్వర్ణజీత్ సింగ్ ఓ వ్యాపారాన్ని నిర్వహించేవారని పోలీసులు వివరించారు.