Minister: ‘ఆన్లైన్ రమ్మీ’పై సమగ్ర వివరాలిచ్చాం
ABN , First Publish Date - 2022-12-02T08:45:34+05:30 IST
ఆన్లైన్ రమ్మీ(online rummy)ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని
- త్వరలోనే ఆ బిల్లుకు మోక్షం
- న్యాయశాఖ మంత్రి రఘుపతి
చెన్నై, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ రమ్మీ(online rummy)ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ ఆర్ఎన్ రవి హామీ ఇచ్చారని న్యాయశాఖ మంత్రి రఘుపతి(Justice Minister Raghupati) పేర్కొన్నారు. అక్టోబరు 19న అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ఇప్పటి వరకూ గవర్నర్ నిర్ణయం వెల్లడించకపోవడంతో పాటు ఆ ముసాయిదా బిల్లుపై పలు అనుమానాలున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నవంబరు 24న రాజ్‌భవన్ నుంచి లేఖ అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సందేహాలపై వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి రఘుపతి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. అరగంటకుపైగా సమావేశమై గవర్నర్ అడిగిన పలు సందేహాలకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ నిషేధించడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఇప్పటి వరకూ ఆన్లైన్ రమ్మీ కారణంగా 34 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందుకే ఈ విపరీత క్రీడను నిషేధించాలని నిర్ణయించామని వివరణ ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన మంత్రి రఘుపతి మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ రమ్మీ(online rummy) నిషేధ బిల్లుపై తన వివరణ విన్న గవర్నర్ తనకున్న సందేహాలకు, ప్రభుత్వం పంపిన వివరణ పరిశీలించి త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలపై వున్న సందేహాల కారణంగానే పెండింగ్‌లో పెట్టినట్లు గవర్నర్ స్పష్టం చేశారన్నారు. అదే విధంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో వున్న 21 బిల్లుల ఆమోదంపై కూడా త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు వివరించారు.