గూగుల్‌ మీట్‌ పెళ్లి... జొమాటో విందు

ABN , First Publish Date - 2022-01-30T17:24:12+05:30 IST

సందీపన్‌ సర్కార్‌, అదితీ దాస్‌లు ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు.

గూగుల్‌ మీట్‌ పెళ్లి... జొమాటో విందు

సందీపన్‌ సర్కార్‌, అదితీ దాస్‌లు ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. కరోనా రెండు దఫాలుగా వారి పెళ్లికి అడ్డుపడటంతో ఈసారి ఆన్‌లైన్‌లోనే అతిథులను ఆహ్వానించారు. కరోనా ఆంక్షలతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పెళ్లి వేడుకలకు 50 నుంచి 200 మందికి మాత్రమే అనుమతి ఇస్తోంది. దాంతో మిగిలిన 350 మంది అతిథులను ‘గూగుల్‌ మీట్‌’ రెండు లింకుల ద్వారా కలుసుకుంటున్నారు. మరో విశేషమేమింటే ఆన్‌లైన్‌ పెళ్లికి హాజరైన వారందరికీ ‘జొమాటో’ ద్వారా విందు అందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘‘నాకు కొవిడ్‌ సోకడంతో జనవరి 4 నుంచి 14 దాకా ఆసుపత్రిలో ఉన్నాను. నాలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అంటున్నాడు పెళ్లికొడుకు సందీపన్‌ సర్కార్‌. 

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా వారిద్దరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరోసారి మూడో వేవ్‌ రావడంతో ఆన్‌లైన్‌ పెళ్లి, విందుకు ప్లాన్‌ చేశారు. కొసమెరుపు ఏమిటంటే పెళ్లికి బహుమతులు, కానుకలను ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా, చదివింపులను జీపే లాంటి డిజిటల్‌ పేమెంట్‌ల నుంచి స్వీకరిస్తామని చెబుతున్నారు. అతిథులకు జొమాటో ద్వారా అందించే విందు భోజనంలో ఫిష్‌, మటన్‌, చికెన్‌, నాన్‌, పులావ్‌లతో పాటు బెంగాలీ రసగుల్లా... చివర్లో పాన్‌ కూడా చేర్చడం విశేషం. 


Updated Date - 2022-01-30T17:24:12+05:30 IST