రూ.10000 నోటును ఎప్పుడైనా చూశారా..? అసలు దీన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే..!
ABN , First Publish Date - 2022-10-29T13:00:00+05:30 IST
పదివేల రూపాయల నోటు విషయంలో భారత ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రవేశపెట్టింది.
ఒకప్పుడు రుపాయి నోటు ఉండేది. దాన్ని ఒక తరం వారు మాత్రమే చూడగలిగారు. పది, ఇరవై, యాభై, వంద, రెండు వందలు, అయిదు వందలు, రెండు వేలు. ఇవీ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు. భారతదేశంలో ఉన్న అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రెండువేల రూపాయల నోటు. ఇది రావడానికి ముందు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రధాని మోదీ అందరికీ షాకిచ్చారు. భారతదేశ ఆర్థిక లావాదేవీలలో 86శాతం వాటాను ఆక్రమించిన ఈ పెద్దనోట్ల నకిలీని నివారించడానికి, నల్లధనాన్ని వెలికితీయడానికి, పన్నుల ఎగవేతను అరికట్టడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వివరించింది
అయితే ఈ నోట్ల రద్దు భారతదేశంలో మొదటిసారిగా 1946 సంవత్సరంలో జరిగింది. అది కూడా పదివేల రూపాయల నోటు విషయంలో భారత ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రవేశపెట్టింది. అసలు పదివేల రూపాయల నోటు ఉండేదని తెలియని ప్రజలకు ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు బ్యాన్ అయిందో అనే సందేహం వస్తుంది.
పదివేల రూపాయల నోటును 1938 సంవత్సరంలో మొదటిసారిగా ఆర్‌బీఐ ముద్రించింది. అయితే తరువాత దీన్ని 1946సంవత్సరంలో బ్యాన్ చేసింది. దీని తరువాత మళ్ళీ 1954సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత మళ్ళీ దీన్ని 1979 సంవత్సరంలో రద్దు చేశారు. ఇలా రెండుసార్లు ప్రజల మధ్యకు వచ్చి కనుమరుగైన పదివేల నోటును సాధారణ ప్రజలు చూసే అవకాశం కూడా కలగలేదు. అప్పటి కాలానికి సగటు పౌరుడి సంపాదన చాలా తక్కువ అవడంతో ఎవరికీ పదివేల నోటు గురించి తెలియలేదు. ఎప్పుడూ ఎవ్వరూ వినని, చూడని పదివేల నోటు ఇలా చరిత్ర పుటల్లో నిలిచిపోయిందన్నమాట.
ప్రస్తుత కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ, కోణార్క్ సూర్యదేవాలయం, గుజరాత్ లో ఉన్న రాణి కి వావ్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలు స్థానం సంపాదించుకోగా కొత్తగా వెలువడిన రెండువేల రూపాయల నోటు పై మంగళ్ యాన్ ఠీవిగా దర్శనమిస్తోంది.
మరొక ముఖ్యవిషయం ఏమిటంటే.. రెండు వేరు వేరు నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండటం అక్కడక్కడా తారసపడుతూ ఉంటుంది. వేరు వేరు గవర్నర్ ల కాలలో ముద్రించబడిన నోట్లమీద వేరువేరు గవర్నర్ సంతకాలతో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది.