PakVsEng: ఇంగ్లండ్ టీమ్‌లో గుర్తించని వైరస్ కలకలం.. మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు..
ABN , First Publish Date - 2022-11-30T19:33:02+05:30 IST
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (Pakistan Vs England) మధ్య తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు పర్యాటక ఇంగ్లిష్ జట్టుకు అనూహ్య పరిస్థితి ఎదురైంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (Pakistan Vs England) మధ్య తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు పర్యాటక ఇంగ్లిష్ జట్టుకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. స్పష్టంగా గుర్తించని ఒక వైరస్ కారణంగా జట్టులోని సగంమంది ఆటగాళ్లు మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్లంతా వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మ్యాచ్‌ను వాయిదా వేసే సూచనలున్నాయి. కాగా అనూహ్యమైన ఈ పరిణామంతో తదుపరి ఏం చేయాలనేదానిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) బుధవారం ప్రకటించింది. కొంతమంది ఇంగ్లండ్ ప్లేయర్లు వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, పీసీబీ ఎప్పటికప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందిస్తామని పేర్కొంది.
కాగా బుధవారం ఉదయం జరగాల్సిన సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కోలుకునేందుకు సమయమిచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూర్పుపై ఆ దేశ మాజీ కెప్టెన్ జో రూట్ స్పందిస్తూ.. కొంతమంది ఆటగాళ్లు సంపూర్ణస్థాయిలో సిద్ధంగాలేరని అన్నాడు. అయితే ఏయే ఆటగాళ్లు సిద్ధంగాలేరనే విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.