KTR: మీ ఐడియా.. మా పెట్టుబడి
ABN , First Publish Date - 2022-12-13T03:45:52+05:30 IST
‘‘ఆలోచనలతో విజయాలు సాధించేందుకు యువతకు ఇదే అత్యంత సరైన సమయం. ప్రజల సమస్యలను తీర్చగలిగే వినూత్న ఆలోచనలు ఉంటే.. ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏంజెల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అడోబ్ సిస్టమ్స్ సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత శంతను నారాయణ్ అన్నారు.
స్టార్టప్‌గా నిరూపించుకునేందుకు ఇదే సరైన తరుణం
నా ఎదుగుదలకు పునాది పడింది హైదరాబాద్‌లోనే..!
ఈ తరంలో పుట్టి ఉంటే అమెరికా వెళ్లే వాడిని కాదు
టై గ్లోబల్ సమ్మిట్‌లో అడోబ్ సీఈవో శంతను నారాయణ్
తెలంగాణ స్టార్టప్‌ల రాష్ట్రం.. పెట్టుబడులకు ఎంచుకోండి
2వ అతిపెద్ద క్యాంపస్ పెట్టండి: ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘ఆలోచనలతో విజయాలు సాధించేందుకు యువతకు ఇదే అత్యంత సరైన సమయం. ప్రజల సమస్యలను తీర్చగలిగే వినూత్న ఆలోచనలు ఉంటే.. ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏంజెల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అడోబ్ సిస్టమ్స్ సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత శంతను నారాయణ్ అన్నారు. భవిష్యత్తు కృత్రిమ మేధ (ఏఐ)దేనని, ఇందులో భారీ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వైద్యారోగ్యంతో పాటు ఇతర రంగాల్లోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తేనుందని, ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. స్టార్టప్స్ సంస్కృతిని ప్రోత్సహించే ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టీఐఈ- టై) సంస్థ 3 రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2022 సోమవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. సీఈవో ఆఫ్ ది ఇయర్-22 అవార్డును శంతనుకు అందించారు. శంతను మాట్లాడుతూ.. టి-హబ్ గురించి కేటీఆర్ తెలిపారని, రాష్ట్ర సర్కారు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను స్టార్టప్ స్టేట్‌గా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ స్థానం సాధించిందన్నారు. 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు 250 శాతం పెరిగినట్లు తెలిపారు. టి-హబ్ అనతి కాలంలోనే ఘన విజయాలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి ప్రైవేటు ఉపగ్రహం తయారీదారులు టి-హబ్ ఇంక్యుబేటర్లేనని గుర్తుచేశారు. ‘అడోబ్ సీఈవోగా హైదరాబాదీ ఉండటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. పెట్టుబడులకు మా నగరాన్ని ఎంచుకోండి’ అని శంతనును కోరారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టై ప్రతినిధులు మురళి బుక్కపట్నం, సురే్‌షరాజు, వివిధ దేశాలకు చెందిన 3వేలకు పైగా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఈవో కంటే పద్మశ్రీ పొందినప్పుడే ఆనందం
ఆరు బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో అయినప్పటి కంటే పద్మశ్రీ పొందినప్పుడే ఎక్కువ సంతోషించానని, పుట్టి పెరిగిన హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని శంతను పేర్కొన్నారు. సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాక టై గ్లోబల్ ఛైర్మన్ బీజే అరుణ్‌తో ఆయన సంభాషించారు. వారి పక్కనే కేటీఆర్ ఉన్నారు. ‘‘అడోబ్‌ను ఇప్పుడు ప్రారంభించి ఉంటే హైదరాబాద్‌లోనే ఇంక్యుబేట్ చేసేవాళ్లమేమో? నేను గనుక ఈ తరంలో పుట్టి ఉంటే అమెరికా వెళ్లే వాడిని కాదు. ఈ నగరం నా ఎదుగుదలకు ఎంతో తోడ్పడింది. విద్యారణ్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివా. ఇక్కడి ఉపాధ్యాయులు మనం ఆలోచించేలా చేస్తారు. ఓయూలో ఎలకా్ట్రనిక్స్ డిగ్రీ చేస్తుండగా మైక్రో ప్రాసెసర్స్‌పై ఆసక్తి పెరిగింది. అందరిలాగానే అమెరికా వెళ్లా’’ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో కాలేజీ హైరింగ్ చేయడానికి ఇష్టపడుతున్నామని తెలిపారు. ‘‘విజయవంతమైన వ్యాపారి కావాలంటే, ఆలోచనల్లోనూ యువకుడిగా ఉండాలి. తెలుసుకోవాలనే ఆసక్తిని కనబర్చాలి. ఓ ఆలోచన అంటూ ఉంటే దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి వెంచర్ కమ్యూనిటీ అద్భుతంగా తోడ్పడుతుంది. ఈ క్రమంలోనే మిషన్, విజన్, పర్పస్ గురించి కంపెనీలు ఆలోచించాలని’’ సూచించారు. సాంకేతికతలో రాబోయే దశాబ్దం భారత్‌దే అని శంతను చెప్పారు.
హైదరాబాద్‌లో అడోబ్‌ను విస్తరించండి: కేటీఆర్
పలు కంపెనీల రావడంలో శంతను తోడ్పాటు అందించారని కేటీఆర్ తెలిపారు. ‘‘శంతను మనవాడు. ఇక్కడ అడోబ్‌లో 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కార్యకలాపాలు విస్తరించండి. ప్రపంచంలో ఏ ఇన్వెస్టర్ లేదా కంపెనీతో మాట్లాడినా శంతను మా ఫ్రెండ్ అని చెబుతుంటాం. హైదరాబాద్‌లో మీ రెండో అతిపెద్ద క్యాంపస్ పెట్టండి’’ అని కోరారు. వచ్చే దశాబ్దంలో భారత ప్రభుత్వం, వ్యాపారులు ఎదుర్కొనే సవాళ్లను శంతను నుంచి తెలుసుకోవాలని ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి శంతను స్పందిస్తూ ‘ఔత్సాహిక వ్యాపారులకు చెప్పేది ఒకటే. వైఫల్యం ఓ అనుభవం. దానిని వేడుకగా జరుపుకోండి. బే ఏరియాలో ఉన్న ఈ సంస్కృతి హైదరాబాద్‌లో కూడా రావాల్సి ఉంది’’ అని తెలిపారు.
బెంగళూరులో తిరగలేరు.. హెలికాప్టర్ పంపుతాం
సంభాషణల మధ్యలో.. కేటీఆర్ మాట్లాడుతూ ‘‘శంతన్ మీరు ఎల్లుండి బెంగళూరు వెళ్తున్నారు. హైదరాబాద్‌లో అంత స్వేచ్ఛగా అక్కడ మీరు తిరగలేరు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మా ప్రభుత్వ ం తరఫున హెలికాప్టర్ పంపుతాం’’ అని సూచించారు.